తమిళనాడు రాజకీయాల్లో బీజేపీకి ఒక కొత్త ఊపును, గొంతును ఇచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై ప్రస్థానం ఇప్పుడు ఒక అనూహ్య మలుపు తిరిగింది. సింగం ఇమేజ్‌తో రాజకీయాల్లోకి వచ్చి, అన్నాడీఎంకే స్థానాన్ని భర్తీ చేస్తూ బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టాలని ఆయన కలలుగన్నారు. కానీ , 2026 అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలు అన్నామలై ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రస్తుతం ఎన్నికల బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. గౌరవంగా అలా చెప్పుకున్నా ఆయనను తప్పించారు. ఇప్పటికే అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు ఎన్నికల్లో అసలు జోక్యం లేకుండా చేశారు. అన్నాడీఎంకేకు ఇష్టం లేకపోవడమే కారణం.
పళనిస్వామి పట్టు.. అన్నామలై అవుట్
అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి , అన్నామలై మధ్య ఉన్న విభేదాలు ఇప్పటివి కావు. అన్నాడీఎంకేను విమర్శిస్తూ, ఆ పార్టీ క్యాడర్‌ను బీజేపీ వైపు మళ్లించే ప్రయత్నం చేసిన అన్నామలై తీరును ఈపీఎస్ ఏమాత్రం సహించలేకపోయారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించాలంటే పొత్తు అనివార్యమని భావించిన బీజేపీ హైకమాండ్, అన్నాడీఎంకే పెట్టిన అన్నామలైను తొలగించాలి అనే కఠిన నిబంధనకు తలొగ్గింది. ఫలితంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన అన్నామలైను పొత్తుల కోసం హైకమాండ్ బలిపీఠం ఎక్కించింది. ఇప్పుడు ఎన్నికల్లోనూ ఆయన పాత్ర, ప్రమేయం లేకుండా చేస్తోంది.
ఎదుగుదల ఎంత వేగమో.. పతనం అంతే !
ఐపీఎస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అన్నామలై, ఇప్పుడు సొంత రాష్ట్ర రాజకీయాల్లోనే అన్ వాంటెడ్ వ్యక్తిగా మారిపోయారు. ద్రవిడ రాజకీయాలను ఎదుర్కోవడానికి ఆయన ఎంచుకున్న దూకుడు వైఖరి పార్టీకి మైలేజ్ తెచ్చినప్పటికీ, పొత్తుల అవసరాల ముందు ఆ వ్యక్తిత్వం సరిపోలేదని తేలిపోయింది. ఓ సందర్భంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికీ ఆయన పేరు పరిశీలించారని చెప్పుకున్నారు.. ఇప్పుడు ఆయన ఎక్కడికో పడిపోయారు. కానీ తన పార్టీపై నమ్మకంతోనే ఉన్నారు.
కేంద్ర మంత్రి చేస్తారన్న ప్రచారం
అన్నామలై సేవలను పూర్తిగా వృథా పోనివ్వకూడదని భావిస్తున్న బీజేపీ అధిష్టానం, ఆయనకు బంగారు పంజరం లాంటి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల్లో ఆయన ప్రమేయం లేకుండా చూస్తూనే, జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని అన్నామలైకు కేటాయించాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండటంతో రాజ్యసభ ఎన్నిక సులభం అవుతుందని, ఆపై ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని జాతీయ రాజకీయాలకు పరిమితం చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అప్పటికి తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి. దాన్ని బట్టే తదుపరి నిర్ణయం ఉండవచ్చు.
