విజయసాయిరెడ్డి ఇలా రాజీనామా చేయగానే అలా ఆమోదించి గెజిట్ రిలీజ్ చేసేశారు కేంద్ర మంత్రి ధన్ఖడ్. అంటే ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఆ సీటు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇంకా వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. చేస్తారా లేదా అన్న సంగతిని పక్కన పెడితే ఇప్పటికి అయితే ఓ సీటు ఖాళీ అయింది. అది కూటమిలోని ఏ పార్టీ తీసుకుంటుందన్నది సస్పెన్స్ గా మారింది.
అయితే విజయసాయిరెడ్డి పూర్తిగా బీజేపీతో మాట్లాడుకుని రాజీనామా చేశారు కాబట్టి ఆ సీటు బీజేపీకే వెళ్తుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. నాగబాబును మంత్రిని చేస్తామని ఇప్పటికే ప్రకటించారు కాబట్టి.. ఆయన పేరు రేసులో లేనట్లే. టీడీపీ కూడా ఆ స్థానంపై ఎలాంటి ఆశలు పెట్టుకోవడం లేదు. బీజేపీ ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఫైనల్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనను రాజ్యసభకు పంపితే.. రెడ్డి ఓటు బ్యాంక్ తమ వైపు మరింత ఎక్కువగా ఉంటుందని బీజేపీ నమ్ముతోంది.
అయితే బీజేపీ జాతీయ స్థాయి నేతలు ఎవరైనా ఇంకా రేసులో ఉన్నారా లేదా అన్నది స్పష్టత లేదు. ఓ ప్రత్యేకమైన కారణంతోనే హడావుడిగా రాజీనామా చేయించి ఉంటారు. ఎవర్ని రాజ్యసభకు పంపాలని రాజీనామా చేయించారో అన్నది ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.