తమిళనాడు రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టిన నటుడు విజయ్, తన భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిస్తున్న కొద్దీ సవాళ్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇఫ్తార్ విందు వేదికగా తాను భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని విజయ్ చేసిన ప్రకటన, రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి లీకులు రావడం వెనుక బలమైన రాజకీయ సంకేతాలు ఉన్నాయని అనుకోకుండా ఉండలేరు. ఇది బీజేపీ పంపిన మొదటి ప్రమాద హెచ్చరికలాంటిది.
షూటింగ్ వైఫల్యమా? వ్యవస్థాగత లోపమా?
కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగవంతం కావడం, అందులో విజయ్ పాత్రపై మీడియాకు సమాచారం అందడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన సినిమా జననాయగన్ షూటింగ్ కోసం విజయ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలే 41 మంది ప్రాణాలు పోవడానికి కారణమని, దీనిపై ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజకీయసభ పేరుతో సినిమా షూటింగ్ కోసం జనాల్ని తరలించారన్న అంశం విజయ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేదే.
బీజేపీ నిర్దాక్షిణ్య వ్యూహం – విజయ్ సిద్ధమేనా?
జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం అత్యంత కఠినంగా ఉంటోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వేళ్లూనుకోవాలని చూస్తున్న క్రమంలో, తమకు అడ్డంకిగా మారే శక్తులను దర్యాప్తు సంస్థల ద్వారా ఒత్తిడికి గురిచేయడం ఆ పార్టీ ప్రధాన వ్యూహంలోఒకటి. విజయ్‌కు రాజకీయాల్లో ఇది ప్రాథమిక దశ మాత్రమే. నోటీసులు, విచారణలు వంటి రూపాల్లో రాబోయే అసలైన సినిమా ను తట్టుకుని నిలబడే శక్తి విజయ్‌కు ఉందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకవేళ ఈ ఒత్తిడిని భరించలేకపోతే, రాజీపడి పొత్తుకు సిద్ధమవ్వక తప్పని పరిస్థితిని కల్పించడమే ఇక్కడి అసలు వ్యూహంగా కనిపిస్తోంది.
నామినేషన్ల వేళ.. తమిళనాడులో మారనున్న సమీకరణాలు
తమిళనాడులో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి ఈ పరిణామాలు మరింత వేడెక్కనున్నాయి. ఒకవైపు డీఎంకే, మరోవైపు ఏఐఏడీఎంకే వంటి బలమైన ప్రాంతీయ శక్తుల మధ్య మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న విజయ్‌కు, ఈ కేంద్ర సంస్థల చుట్టూ తిరిగే వివాదాలు ప్రతిబంధకంగా మారవచ్చు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను కాపాడుకుంటూనే, ఈ ఢిల్లీ రాజకీయాల ను విజయ్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఇచ్చే హెచ్చరికలకు లొంగి పొత్తుకు సిద్ధమవుతారా లేక ఒంటరి పోరాటంతో తన సత్తా చాటుతారా అనేది తమిళ ప్రజల ముందున్న సందేహం.
