కేరళ రాజకీయాల్లో గత దశాబ్దాలుగా ఉన్న సమీకరణాలను మార్చేస్తూ, బీజేపీ చేపట్టిన మిషన్ క్రిస్టియన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిందూత్వ అజెండాతో ముందుకు సాగే బీజేపీ, కేరళలో అనూహ్యంగా క్రైస్తవ సామాజికవర్గం మద్దతును కూడగట్టడంలో సక్సెస్ అవుతోంది. కేరళలోని క్రైస్తవ సంఘాలు, ముఖ్యంగా కాథలిక్ చర్చిలు, రాష్ట్రంలో పెరుగుతున్న ముస్లిం జనాభా , వారి ఆర్థిక, రాజకీయ ప్రాబల్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లవ్ జిహాద్ ,ల్యాండ్ జిహాద్ వంటి అంశాలను క్రైస్తవ మత పెద్దలే బహిరంగంగా ప్రస్తావించడం బీజేపీకి కలిసొచ్చింది. ఈ అంశాలపై బీజేపీ , క్రైస్తవ వర్గాల ఆలోచనలు కలవడంతో, ఒకప్పుడు బీజేపీకి దూరంగా ఉన్న చర్చిలు ఇప్పుడు ఆ పార్టీతో చర్చలకు సిద్ధమవుతున్నాయి. దీనిని సానుకూలంగా మలుచుకున్న బీజేపీ.. క్రైస్తవ రక్షణకు తామే భరోసా అని నమ్మించడంలో విజయం సాధిస్తోంది.
ప్రధాని మోదీ ప్రత్యేక చొరవ – స్నేహ యాత్రలు
బీజేపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ క్రైస్తవ మత పెద్దలతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. ఈస్టర్, క్రిస్మస్ వంటి పండగల సమయంలో బీజేపీ నేతలు క్రైస్తవుల ఇళ్లకు వెళ్లడం, మతగురువులను కలిసి గౌరవించడం వంటి స్నేహ యాత్రలు క్షేత్రస్థాయిలో మార్పు తెచ్చాయి. గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న సెంట్రల్ కేరళలోని క్రైస్తవ బెల్ట్‌లో బీజేపీ ఇప్పుడు తన ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు మతాలకు అతీతంగా అందుతున్నాయని ప్రచారం చేయడం కూడా కలిసొచ్చిన మరో అంశం.
కాంగ్రెస్ బలహీనత.. బీజేపీకి అవకాశం
సాధారణంగా కేరళ క్రైస్తవులు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు మద్దతు ఇచ్చేవారు. అయితే, కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం, ముస్లిం లీగ్ తో కాంగ్రెస్ పొత్తును క్రైస్తవ వర్గాలు సందేహంతో చూడటం మొదలుపెట్టాయి. ముస్లిం లీగ్ ప్రాబల్యం పెరిగితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావిస్తున్న క్రైస్తవులకు, ఇప్పుడు బీజేపీ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. లెఫ్ట్ కూటమిని ఎదుర్కోవాలంటే బీజేపీతో చేతులు కలపడమే మేలనే చర్చ కొన్ని క్రైస్తవ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రబ్బరు రైతుల సమస్యలు – వ్యూహాత్మక అడుగు
రాజకీయ అంశాలతో పాటు ఆర్థిక అంశాలను కూడా బీజేపీ తెలివిగా వాడుకుంటోంది. కేరళలో రబ్బరు పండించే రైతుల్లో మెజారిటీ క్రైస్తవులే. రబ్బరు ధరల పతనంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశను బీజేపీ కల్పించింది. రబ్బరు ధర కిలో రూ. 250 చేస్తే బీజేపీకి మద్దతు ఇస్తాం అని కొన్ని చర్చి వర్గాలు బహిరంగంగా ప్రకటించాయి. ఇలా మతపరమైన, ఆర్థికపరమైన కారణాలను జోడించి బీజేపీ చేస్తున్న మిషన్ క్రిస్టియన్ కేరళలో త్రిముఖ పోటీని అనివార్యం చేస్తోంది.


