జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీజేపీ వ్యూహం రాజకీయ పార్టీలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాలిడ్ గా ఆ పార్టీకి పాతిక వేల ఓటు బ్యాంక్ ఉంటుంది. తమ ఓటు బ్యాంకుకు తోడు వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్న వ్యక్తిని నిలబెడితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నమే బీజేపీ వైపు నుంచి సాగడం లేదు. ఎందుకు ఇలా లైట్ తీసుకున్నారో ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు.
ఉపఎన్నిక వస్తుందని తెలిసినా నో గ్రౌండ్ వర్క్
జూబ్లిహిల్స్ కు ఉపఎన్నిక ఖాయమని క్లారిటీ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు రంగంలోకి దిగి గ్రౌండ్ వర్క్ చేసుకున్నాయి.కానీ బీజేపీ మాత్రం కదల్లేదు. ఇప్పుడు సోమవారం నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్నా అభ్యర్థి ఖరారుపై ఇంకా తేల్చలేదు. ఎవరైనా బలమైన అభ్యర్థిని ప్రచారంలోకి తెచ్చారా అంటే అదీ లేదు. అందుకే అసహనానికి గురైన ఎంపీ ధర్మపురి అర్వింద్..బొంతు రామ్మోహన్ పేరును ప్రస్తావించారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ నేత . పార్టీలోకి తీసుకుని టిక్కెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. అది బీజేపీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని హైలెట్ చేసింది. అభ్యర్థి గురించి పట్టించుకోవడంలేదని స్పష్టత వచ్చింది.
బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోవాలని ప్లానా ?
అయితే బీజేపీ వ్యూహాత్మకంగానే ఇలా చేస్తోందని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఆ వ్యూహం వెనుక రెండు కారణాలు ఉంటాయని అంటున్నారు. భారతరాష్ట్ర సమితిని ఎంత నిర్వీర్యం చేస్తే బీజేపీ అంత బలపడుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అది నిరూపితమయింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీ వైపు వస్తోంది. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో ఆ పార్టీ మరోసారి ఘోరంగా ఓడిపోతే ఆ పార్టీకి భవిష్యత్ లేదని రాజకీయ వర్గాలు తేల్చేస్తాయి. అంత కంటే కావాల్సింది బీజేపీకి ఏమీ ఉండదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసి కాంగ్రెస్ కు అనుకూలంగా చేసింది బీజేపీ నిర్ణయాలేనని అందరికీ క్లారిటీ ఉంది. అలాగే తాము ఇప్పుడు గట్టిగా పోటీ పడితే ముక్కోణపు పోరు జరుగుతుందని.. ఆ పోరులో బీఆర్ఎస్ బయటపడినా ఆశ్చర్యం లేదని అందుకే సైలెంటుగా .. తూతూ మంత్రం పోటీకి సిద్ధమయ్యారని అంటున్నారు.
బీఆర్ఎస్కు సహకరిస్తున్నారని కాంగ్రెస్ అనుమానం
అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ వ్యూహాన్ని అలా అనుకోవడంలేదు. బీజేపీ, టీడీపీ సహా అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిపోయిందని.. ప్రచారం చేసేందుకు ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలనుకుంటున్నారని అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వెనుక ఏ వ్యూహం ఉందో కానీ.. ఆ పార్టీ రేసులో లేదని ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేస్తున్నారు.