కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్లధన డిక్లరేషన్ విధానం ఆంధ్రాలో పొలిటికల్ ఇష్యూ అయిపోయింది! కేంద్రం దగ్గర అత్యంత గోప్యంగా ఉన్న నల్లధనవంతుల వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎలా తెలిశాయి అనేది ప్రశ్న! సరే, కేంద్ర సర్కారులో ఆయనకి హితులూ సన్నిహితులూ ఉన్నారు కాబట్టి, ఆ సమాచారం లీకైందనే అభిప్రాయాలు ఉన్నాయి. హైదరాబాద్ జోన్లో రూ. 13 వేల కోట్ల నల్లధనం ఒకరి దగ్గరే ఉందని వెల్లడైనట్టు చంద్రబాబు లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఒకసారి కాదు.. కనీసం రెండుమూడుసార్లు ఇదే విషయాన్ని ప్రస్థావించారు. వెలగపూడిలో సీఎం ఆఫీస్ ప్రారంభం సందర్భంగానూ ఈ టాపిక్ గురించి మళ్లీ మాట్లాడారు. ఆ వ్యక్తి మరెవరో కాదు విపక్ష నేత వైయస్ జగన్ అని టీడీపీ నేతలు నిర్ధరించేశారు! అయితే, ఈ విమర్శలను తిప్పి కొట్టేందుకు వైకాపా కూడా రంగంలోకి దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జగన్ ఓ లేఖ రాశారు. నల్ల కుబేరుల వివరాలు చంద్రబాబుకు ఎలా తెలిశాయని లేఖలో ప్రశ్నించారు. ఆ జాబితాలో ఉన్నవారి పేర్లను విడుదల చేయాలనీ, వాటిలో చంద్రబాబుకు చెందిన బినామీ కూడా ఒకరు ఉన్నారని జగన్ ఆరోపించారు.
అత్యంత రహస్యంగా ఉంచాల్సిన కేంద్ర వ్యవహారాన్ని ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేతలు కలిసి రాజకీయం చేస్తుంటే కేంద్రం ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది! నిజానికి, ఈ అంశంపై కేంద్రం పల్లెత్తి మాట్లాడే పరిస్థితి ఉండదు. నల్లధనం ప్రకటించిన వారి వివరాలను గోప్యంగానే కేంద్రం ఉంచుతుంది. కాబట్టి దీన్ని తనకు అనుకూలంగా చంద్రబాబు మార్చుకుని వాడుకుంటున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే జగన్‌పై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు బలంగా వినిపించారు. ఆ జాబితాలో మరో 13 వేల కోట్లు చేర్చారు. జగన్‌కు అక్రమ ఆస్తులు ఉన్నాయనీ, గనులు ఉన్నాయంటూ మంత్రి దేవినేని ఉమ వాటికి లెక్కలు కూడా చెప్పేశారు. అయితే, ఈ ఆరోపణల వల్ల తెలుగుదేశానికి కొత్తగా వచ్చే మైలేజ్ ఏంటన్నది ప్రశ్న? మహా అయితే, నారా లోకేష్‌పై విపక్షం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధ నుంచీ వారి డైవర్ల్ చేయడానికి ఈ ఇష్యూ కొంతమేరకు ఉపయోగపడిందని చెప్పొచ్చు!
ఇక, జగన్ కూడా వెంటనే స్పందించి ప్రధానికి లేఖ రాశారు. ఆయన ధీమా ఆయనది! జగన్ లేఖ రాసినంత మాత్రాన కేంద్రం ఠక్కున స్పందించేసి, నల్లకుబేరులు వీరే.. హైదరాబాద్‌లో రూ. 13 వేల కోట్లూ ఇతగాడివే అని పేర్లు బయటపెట్టే పరిస్థితి ఉండదు కదా. జగన్ లేఖకు కేంద్రం స్పందించే పరిస్థితి ఉంటుందని ఎవ్వరూ అనుకోరు. ఆ ధైర్యంతోనే జగన్ చీకట్లోకి ఓ లేఖాస్త్రం సంధించారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి.. బ్లాక్ మనీ అంశాన్ని చంద్రబాబు, జగన్‌లు ఎవరికి అనుకూలంగా వారు మార్చుకుని పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు అనేది విశ్లేషకుల అభిప్రాయం.