బీఎండబ్ల్యూ , బెంజ్ కార్లు అంటే లగ్జరీ. ఈ సంస్థలు కార్లు మాత్రమే అమ్ముతాయని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడీ సంస్థలు ఇండియాలో రియల్ ఎస్టేట్ ప్రారంభించబోతున్నాయి. ఇప్పటి వరకు రోడ్లపై మెరిసిన లగ్జరీ కార్ల బ్రాండ్ మెర్సిడెస్ బెంచ్ ఇప్పుడు ఆకాశహర్మ్యాలపై తమ ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. తమ కార్ల లాగే సంపన్న వర్గాలను ఆకర్షించేందుకు ఈ కంపెనీలు బ్రాండెడ్ రెసిడెన్స్ ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
గురుగ్రామ్ లో మెర్సిడెస్ బెంజ్ తన తొలి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే పలువురు ప్రముఖ డెవలపర్లతో చర్చలు జరుపుతోంది. దుబాయ్‌లో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ ప్లేసెస్ పేరుతో భారీ టవర్లను నిర్మిస్తున్న ఈ సంస్థ, అదే తరహా అత్యాధునిక సౌకర్యాలు, డిజైన్ , లగ్జరీ అనుభూతిని భారతీయ కస్టమర్లకు అందించాలని భావిస్తోంది. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా, బ్రాండ్ విలువను ప్రతిబింబించే జీవనశైలిని అందించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశ్యం.
మరోవైపు, BMW గ్రూప్ కూడా భారత రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై దృష్టి సారించినట్లుగా ప్రచారం జరుగుతోంది. 2026 నాటికి దేశంలో లగ్జరీ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలతో, తమ బ్రాండ్ డిజైన్ ఫిలాసఫీని ఇళ్ల నిర్మాణంలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కార్ల తయారీలో తాము పాటించే ఖచ్చితత్వం, టెక్నాలజీ , ప్రీమియం లుక్‌ను ఈ భవనాల్లో కూడా చూడవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం జర్మన్ బ్రాండ్లే కాకుండా, ఇటాలియన్ కార్ల దిగ్గజం లంబోర్గిని కుటుంబం కూడా ముంబై , చెన్నై వంటి నగరాల్లో లగ్జరీ హోమ్స్ నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా స్టార్ హోటళ్లతో మాత్రమే రియల్ ఎస్టేట్ ఒప్పందాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఆటోమొబైల్ బ్రాండ్ల రాకతో భారత రియల్ ఎస్టేట్ ముఖచిత్రం అంతర్జాతీయ స్థాయికి చేరుతోంది.
