ఏపీలో వరదలు వస్తే.. బ్యారేజీలను డ్యామేజీ చేయడానికి బోట్లు కొట్టుకు వచ్చేస్తాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా వస్తున్న బోట్లను చూసి అధికారులు అప్రమత్తమవుతున్నారు. గతంలో ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొట్టి ఇసుక బోట్లు ఆగిపోయాయి. వాటిని వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా నదిలో వదిలి పెట్టారని తెలియడంతో కేసులు పెట్టారు. అతి కష్టం మీద గేట్ల మధ్య ఇరుక్కుపోయిన బోట్లను బయటకు తీశారు.
ఈ సారి ప్రకాశం బ్యారేజీతో పాటు..నెల్లూరులోని పెన్నా నదిపై ఉన్న సంగం బ్యారేజీకి బోటు కొట్టుకు వచ్చింది. ఇవన్నీ అత్యంత ప్రమాదకమైన బోట్లు. నేరుగా వెళ్లి బ్యారేజీని తాకితే.. అన్నమయ్య డ్యాం తరహాలో ఉత్పాతం సంభవిస్తుంది. అయితే గత అనుభవాలతో అధికారులు ఈ సారి బ్యారేజీల వైపు బోట్లు ఏమైనా వస్తున్నాయేమోనని నిఘా పెట్టారు.
సంగం బ్యారేజీ వైపు దూసుకొస్తున్న 30 టన్నుల ఇసుక బోటును గుర్తించి వెంటనే.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒడ్డుకు తీసుకు వచ్చారు. ఈ ఆపరేషన్ చాలా ఉత్కంఠగా సాగింది. మరో వైపు ప్రకాశం బ్యారేజీ వైపు దూసుకొస్తున్న మరో బోటును డ్రోన్ల ద్వారా గుర్తించి గజ ఈతగాళ్ల ద్వారా దాన్ని ఆపి.. ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ రెండు బోట్ల బ్యారేజీలను తాకి ఉంటే పెను ప్రమాదం జరిగింది. అసలు ఇలాంటి బోట్లను ఎందుకు వదిలేస్తున్నారు.. అవి ఎందుకు అలా బ్యారేజీల వైపు వస్తున్నాయన్న మిస్టరీని మాత్రం పోలీసులు చేధించాల్సి ఉంది.