విజయవాడ రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతూ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఈ కేసును కులాల వైషమ్యాలుగా మార్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో.. జనసేన పార్టీ సీనియర్ నేత, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వివాదాన్ని పూర్తిగా కొత్త మలుపు తిప్పాయి.
అసలు సాయికృష్ణ ఎక్కడో పోలేదు.. అతడు సురక్షితంగా వైసీపీ నాయకుల రక్షణలోనే దాక్కున్నాడేమోననే సరికొత్త అనుమానాన్ని ఆయన తెరపైకి తెచ్చారు. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు వైసీపీ ఆడుతున్న క్షుద్ర రాజకీయంలో భాగమే ఇదంతా అని బొలిశెట్టి వ్యక్తం చేసిన సందేహం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మీడియా వేదికగా వైసీపీ నేత అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ పక్కా లాజిక్‌తో కొన్ని ప్రశ్నలు సంధించారు. గతంలో సాయికృష్ణ చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన బాధితుడు నవీన్ రెడ్డి ఫొటోను పట్టుకుని.. అదే సాయికృష్ణ ఫొటో అంటూ సామాన్య ప్రజలను నమ్మించేందుకు వైసీపీ , సాక్షి మీడియా నానా తంటాలు పడుతోందని ఆయన మండిపడ్డారు. బాధితుడి ఫొటోను నిందితుడి ఫొటోగా చూపిస్తూ కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్న అంబటి రాంబాబు.. ఈ ఫొటోల వెనుక ఉన్న అసలు నిజాలేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం శవాల మీద పేలాలు ఏరుకునే క్షుద్ర రాజకీయాలు చేయడంలో వైసీపీ సిద్ధహస్తురాలని ప్రజలందరికీ తెలుసని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావడానికి సాయికృష్ణను వైసీపీ నేతలే ఎక్కడో ఒకచోట రహస్యంగా దాచిపెట్టి, ఇక్కడ లాకప్ డెత్ అంటూ డ్రామాలు ఆడుతున్నారనే కోణంలో దర్యాప్తు సంస్థలు కూడా దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఒకవేళ సాయికృష్ణ నిజంగానే బతికి ఉంటే, అతడిని వెంటనే పోలీసుల ముందు ప్రవేశపెట్టేలా వైసీపీ చొరవ చూపాలని, అంతేకాని తప్పుడు నరేటివ్లతో సమాజంలో అశాంతి రేపాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బొలిశెట్టి శ్రీనివాస్ లేవనెత్తిన ఈ పాయింట్లో బలమైన లాజిక్ ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే, హైకోర్టు జూన్ 29 లోగా సాయికృష్ణను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. ఒకవేళ సాయికృష్ణ ఎక్కడైనా క్షేమంగా ఉండి, అతడికి వైసీపీ నేతలు ఆశ్రయం కల్పించినట్లు తేలితే మాత్రం ఆ పార్టీ చట్టపరంగా తీవ్ర ఇబ్బందుల్లో పడటం ఖాయం. అదృశ్యం కేసు కాస్తా.. నేరగాడికి ఆశ్రయం కల్పించిన కేసుగా మారి తిరగాబోయి వైసీపీ నేతల మెడకే చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
