మరో మూడు రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇక కుర్రాళ్ల కళ్లన్నీ అటువైపే. ప్రతీసారీ ఐపీఎల్ తొలి మ్యాచ్‌ని అట్టహాసంగా ప్రారంభించడం రివాజు. ఈసారీ కూడా అదే జరగబోతోంది. కొలకొత్తా వేదికగా ఈడెన్ గార్డెన్లో కొలకొత్తా, బెంగళూరు తొలి పోరులో తలపడబోతున్నాయి. మ్యాచ్‌కు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఎలానూ ఉంటాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారాగణం పాల్గొనబోతోంది. కొలకొత్తా అనగానే ఖారుఖ్ ఖాన్ ఎంట్రీ తప్పని సరి. తlతో పాటుగా సల్మాన్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, సంజయ్‌దత్ సైతం ఈ షోలో మెరవబోతున్నారు. కథానాయికల విషయానికొస్తే.. కత్రినా, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి, శ్రద్దా కపూర్, ప్రియాంకా చోప్రా, తమన్నా, కరీనా కపూర్, పూజా హెగ్డే, ఊర్వశి రౌతాలా.. ఇలా చాలామంది కథానాయికలు ఐపీఎల్ కోసం డేట్లు ఇచ్చారు. ఇది వరకెప్పుడూ రానంతమంది నటీనటులు ఈ షోలో పాల్గొన బోతున్నారని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపుగా సగం బాలీవుడ్ ఈ వేడుకలో కనిపించబోతోంది.
అయితే వీళ్లేం ఊరకే రారు. ఫ్రాంచైజీలు వీళ్లకు భారీ పారితోషికాల్ని ముట్టజెబుతున్నాయి. కేవలం ఓపెనింగ్ సెలబ్రేషన్స్ కోసం జరుగుతున్న ఈ హంగామా కోసం దాదాపు రూ.40 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు టాక్. ముగింపు వేడుకల్లోనూ మరికొంత మంది స్టార్లు పాల్గొంటారు. టాలీవుడ్ నుంచి ఈ దఫా ఎవరికైనా ఆహ్వానాలు అందాయా, లేదా? అనేది చూడాలి. రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్‌దేవరకొండ, వెంకటేష్, రానా, నాని వీళ్లలో కొంతమంది ఐపీఎల్ సెలబ్రేషన్స్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. వాళ్లు కూడా వెళ్తే – ఇక ఈ హంగామా రెట్టింపు అయినట్టే.