ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఆదేశ్ శ్రీవాత్సవ (51) నిన్న అర్ధరాత్రి ముంబై, కోకిల బెన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఇంతకు ముందు 2011లో ప్లాస్మా సెల్స్ క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు దాని నుండి బయటపడగలిగారు. కానీ ఈసారి మాత్రం క్యాన్సర్ మహమ్మారి నుండి తప్పించుకోలేకపోయారు. గత 40 రోజులుగా ఆయనకీ కిమో థెరపీ చికిత్స చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో దానినీ కొన్ని రోజుల క్రితమే నిలిపివేశారు. ఆయన భార్య విజేత పండిట్, సంగీత దర్శకులయిన ఆయన సోదరులు లలిత్ మరియు జితిన్ పండిట్ తదితర కుటుబ సభ్యులు అందరూ ఆయన ఆఖరి క్షణాల్లో ఆయన పక్కనే ఉన్నారు. ఆయన సంగీతం సమకూర్చిన ‘చల్తే చల్తే’, ‘బాగ్బన్’ ‘కభీ కుషి కభి గమ్’ ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చాయి. ఆయన చేసిన చివరి సినిమా ‘వెల్కం బ్యాక్’ ఇటీవలే విడుదలయింది.