ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్: ది రివెంజ్ ఒక సునామీలా దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎపిక్ భారతీయ సినిమా ప్రమాణాలను మరో మెట్టు ఎక్కించింది. అయితే, ఈ సినిమా విజయాన్ని చూసి దక్షిణాది దిగ్గజాలు రాజమౌళి, రజనీకాంత్, ఎన్టీఆర్ వంటి వారు ఆకాశానికెత్తుతుంటే.. బాలీవుడ్ లోని ఏ-లిస్ట్ స్టార్లు, పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు మాత్రం నోరు మెదపకపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిశ్శబ్ద బహిష్కరణ వెనుక లోతైన కారణాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.
పాతాళానికి పడిపోయిన ఖాన్ ల సామ్రాజ్యం
బాలీవుడ్లో దశాబ్దాలుగా నడుస్తున్న గ్రూపిజం, నెపోటిజం పునాదులను ధురంధర్ కదిలించివేసింది. పెద్ద స్టార్లు, వందల కోట్ల బడ్జెట్ ఉంటేనే సినిమాలు ఆడతాయనే భ్రమను ఈ సినిమా పటాపంచలు చేసింది. కేవలం కంటెంట్, టెక్నికల్ బ్రిలియన్స్‌తో ఆదిత్య ధర్ సాధించిన ఈ విజయం.. బాలీవుడ్ అగ్ర హీరోలకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ కలిగించిందనే వాదన బలంగా ఉంది. తాము చేయలేని పనిని, ఒక చిన్న బ్యాక్‌గ్రౌండ్ ఉన్న దర్శకుడు చేసి చూపించారనే అసూయ వల్లనే వారు ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
ట్రాన్సాక్షనల్ పిఆర్ లేకపోవడం
బాలీవుడ్లో సాధారణంగా ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు ఇతర సెలబ్రిటీలు చేసే ట్వీట్లు, ప్రశంసల వెనుక ఒక గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది. అంటే, నేను నీ సినిమాను పొగిడితే, రేపు నువ్వు నా సినిమాను పొగడాలి అనే ఒప్పందాలు అంతర్గతంగా నడుస్తాయి. అయితే ధురంధర్’ మేకర్స్ ఇలాంటి పెయిడ్ పిఆర్ పనులకు దూరంగా ఉన్నారు. ఎటువంటి కృత్రిమ ప్రచారం లేకుండా, కేవలం మౌత్ టాక్’ తోనే సినిమా ఈ స్థాయికి చేరింది. ఇలాంటి ట్రాన్సాక్షనల్ సంబంధాలకు చోటు లేకపోవడం వల్లే బాలీవుడ్ దిగ్గజాలు మౌన ముద్ర దాల్చారు.
ఐడియాలజీ , లిబరల్ అభ్యంతరాలు
ఈ సినిమాలోని కథాంశం, జాతీయవాద ధోరణి , కొన్ని సున్నితమైన అంశాల పట్ల బాలీవుడ్‌లోని ఒక వర్గానికి తీవ్ర అభ్యంతరాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఉరి సినిమా సమయంలోనూ ఇదే తరహా వ్యతిరేకత ఎదురైంది. ధురంధర్ మొదటి పార్ట్ విషయంలో హృతిక్ రోషన్ అభినందించినప్పటికీ.. ఇటువంటి కథాంశాలతో తాము ఏకీభవించలేమని బహిరంగంగానే చెప్పారు. తాము ఈ సినిమాను పొగిడితే, ఒక నిర్దిష్ట భావజాలానికి అనుకూలమనే ముద్ర పడుతుందన్న భయంతోనే చాలా మంది స్టార్లు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మరోవైపు సౌత్ ఇండస్ట్రీ మాత్రం కేవలం సినిమా ను సినిమాగా చూస్తూ, దానిలోని ప్రతిభను మనస్ఫూర్తిగా అభినందిస్తోంది.
బాలీవుడ్ ను బతికించిన ధురంధర్
నిజానికి, వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్‌కు ధురంధర్ ఒక సంజీవని లాంటిది. హిందీ సినిమా మార్కెట్‌ను ఇది మళ్లీ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. పరిశ్రమకు ప్రాణం పోసిన సినిమాను సొంత ఇండస్ట్రీ వారే సపోర్ట్ చేయకపోవడం బాలీవుడ్ లోని అంతర్గత విభేదాలను, ఓ రకమైన ముఠా వ్యవస్థను ఎత్తిచూపుతోంది. అయితే, సెలబ్రిటీల ప్రశంసలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులే బాలీవుడ్ మౌనానికి అసలైన సమాధానం.


