ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను ఆర్డీఎక్స్ తో పేల్చివేస్తామని బెదిరింపు ఈమెయిల్ రావడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. కేరళ నుంచి ఈమెయిల్ వచ్చినట్లుగా గుర్తించిన అధికారులు తాజ్ మహల్ వద్ద భద్రతను పటిష్టం చేశారు.
మరోవైపు బెదిరింపు ఈ-మెయిల్ రాగానే కేంద్ర పారిశ్రామిక భద్రత దళం , తాజ్ భద్రత పోలీసులు , బాంబు నిర్వీర్య దళం , డాగ్ స్క్వాడ్ , టూరిజం పోలీసులు తాజ్ మహల్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు తాజ్ మహల్ ప్రాంగణంలో ఈ తనిఖీలు చేపట్టారు.
అణువణువునా తనిఖీలు చేపట్టినా తాజ్ మహల్ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఈమెయిల్ నకిలీదేనని గుర్తించారు అధికారులు. అయితే , ఈ బెదిరింపు ఈ మెయిల్ ఎవరు చేసి ఉంటారని అధికారులు విచారణ చేపట్టారు. ఈ బెదిరింపు ఈమెయిల్ పై సైబర్ సెల్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది.