ఓ కంపెనీ కాలుష్యంపై బొండా ఉమ ఏదో చేయాలనుకుని .. ఏదో చేసిన వైనం ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంటోంది. బొండా ఉమ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే క్రెబ్స్ అనే పరిశ్రమ కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని గతంలో ఫిర్యాదులు ఇచ్చారు. ఆ పిర్యాదులపై చర్యలకు ప్రాసెస్ ప్రారంభమయింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్ని పరీక్షలు నిర్వహించి తదుపరి చర్యలకు సిద్ధమయింది. ఇప్పుడు హఠాత్తుగా ఆ పరిశ్రమపై చర్యలు వద్దని బొండా ఉమ పట్టుబడుతున్నారు. పట్టించుకోకపోవడంతో నేరుగా వవన్ కల్యాణ్ ను ఇన్వాల్వ్ చేసి అసెంబ్లీలో మాట్లాడారు.
పవన్ కల్యాణ్ అందుబాటులో ఉండటం లేదన్నట్లుగా అన్యాపదేశంగా మాట్లాడారో..సీరియస్ గా మాట్లాడారో తెలియదు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌కు అసహనాన్ని తెప్పించాయి. పీసీబీ చైర్మన్ సంబంధిత శాఖా మంత్రి అయిన పవన్ కల్యాణ్ అందుబాటులో ఉండటం లేదని తనకు చెప్పారని బొండా ఉమ అన్నారు. పీసీబీ చైర్మన్ అలా చెప్పాడో లేదో వారిద్దరికే తెలియాలి. కానీ ఇలా చెప్పడం వల్ల పవన్ కల్యాణ్‌ను విమర్శించినట్లయింది. అందుకే పవన్ సీరియస్ గా తీసుకున్నారు.
ఇటీవల వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ షూటింగ్‌లకు ఎక్కువ సమయం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన వ్యక్తిగత సమయంలోనే.. ఒకటి రెండు గంటలు కేటాయిస్తున్నానని పవన్ చెబుతున్నారు. పవన్ తన కమిట్మెంట్లను పూర్తి చేయడానికి కష్టపడుతున్నారు కానీ అధికార విధులకు అందుబాటులో లేరు అన్న పేరు తెచ్చుకోలేదు.కానీ బొండా ఉమ మాత్రం ఓ నింద వేసే ప్రయత్నం చేసినట్లుగా జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఆయన తాను అనుకున్నట్లుగా పీసీబీ నుంచి ఉత్తర్వులు తెచ్చుకునేందుకు అసెంబ్లీలో ఇలా మాట్లాడి స్ట్రాటజిక్ మిస్టేక్ చేసినట్లుగా టీడీపీ, జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.