ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపిలపై తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై తెదేపా నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం విశేషం. తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు, మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రమే పవన్ కళ్యాణ్ న్ని గట్టిగా సమర్దిస్తుంటే మిగిలినవారందరూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన దానిలో తప్పేమీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చెపుతోందో తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారని, కానీ తెదేపా నేతలు దానిని వేరే విధంగా అర్ధం చేసుకొని పవన్ కళ్యాణ్ గురించి అనుచితంగా మాట్లాడుతున్నారని, అది తగదని హితవు పలికారు. క్రమశిక్షణకి మారుపేరుగా చెప్పుకోబడే తెదేపాలో నేతలు ఈవిధంగా మీడియా ముందుకి వచ్చి మాట్లాడటం సరికాదని అన్నారు.
రాజ్యసభ సభ్యుడుగా ఉన్న టిజి వెంకటేష్ ని ఉద్దేశ్యించి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు ఈవిధంగా కటువుగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే, బహుశః అది నష్ట నివారణ చర్యలలో భాగంగానే అన్న మాటలుగా భావించవచ్చు. ప్రత్యేక హోదా, నిధుల విషయంలో గతంలో తెదేపా నేతలు కేంద్రప్రభుత్వంపై మొదట ఘాటుగా విమర్శలు చేయడం, ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని వారించడం చాలాసార్లు జరిగింది. బహుశః ఇప్పుడూ పవన్ కళ్యాణ్ విషయంలో తెదేపా అలాగే వ్యవహరిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని దూరం చేసుకోవడం వలన తెదేపాకి ఎంతో కొంత నష్టమే తప్ప లాభం ఉండదు. పవన్ కళ్యాణ్ కూడా తెదేపాతో కటీఫ్ చెపుతున్నట్లు ఏమీ మాట్లాడలేదు. కానీ ప్రత్యేక హోదా విషయంలో తెదేపా గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వలన ప్రజలలో పార్టీ పట్ల దురాభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది కనుకనే తెదేపా నేతలు అందరూ పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడి చేశారు. దానిని ఇంకా కొనసాగిస్తే తెదేపాకే నష్టం. తెదేపాకి కూడా ఆ సంగతి తెలుసు. బహుశః అందుకే బొండా ఉమా మహేశ్వర రావుని రంగంలో దింపి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు భావించవచ్చు. లేకుంటే తెదేపాలో పెద్ద నోరున్న నేతగా ప్రసిద్ది చెందిన ఆయన కూడా మిగిలిన వారితో కలిసి పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడి చేస్తుండేవారే.
పవన్ కళ్యాణ్ భవిష్య కార్యాచరణ గురించి స్పష్టత లేనప్పుడు, ఇప్పుడే ఆయన గురించి అనుచితంగా మాట్లాడి ఆయనని దూరం చేసుకోవడం తొందరపాటే అవుతుందనే ఉద్దేశ్యంతోనే తెదేపా మళ్ళీ పవన్ కళ్యాణ్ భజన మొదలుపెట్టి ఉండవచ్చు. ఒకవేళ ఆయన తెదేపాకి దూరం అయితే ఏవిధంగా ట్రీట్ చేస్తుందో తెదేపా నేతలు అప్పుడే రుచి చూపించారు. పవన్ కళ్యాణ్ ఇంకా రాజకీయాలలో రాక మునుపే ఆయనకీ చాలా మంది శత్రువులు తయారయిపోయారు. కనుక ఇకపై ఆయన చాలా ఆచితూచి ముందుకి అడుగు వేయడం చాలా మంచిది.