ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకోనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంతకాలంగా ఆయనను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తీవ్రరూపం దాల్చడమే దీనికి ప్రధాన కారణం. గతంలో బ్రెయిన్ స్ట్రోక్, ఎన్నికలకు ముందు ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించిన ఆయన, ఇటీవల మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలతో ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది.
రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం అంత ఈజీ కాదు!
రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం ఆయన శరీరానికి సాధ్యం కాదని వైద్యులు హెచ్చరించడంతో, బొత్స కుటుంబ సభ్యులు ఆయనను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుతున్నట్లు సమాచారం. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా, రాజకీయంగా ఎదురవుతున్న మానసిక ఒత్తిళ్లు కూడా బొత్సను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయనపై జగన్ మోహన్ రెడ్డి వైపు నుండి విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా తిరుపతి లడ్డూ వంటి సున్నితమైన అంశాల్లో వైసీపీ వాదనను బలంగా వినిపించలేకపోయారనే అసంతృప్తి అధినేతలో ఉండటం, పార్టీ మైలేజ్ కోసం కులపరమైన విమర్శలు చేయాలని ఒత్తిడి రావడం బొత్సకు నచ్చడం లేదని తెలుస్తోంది. సీనియర్ నేతగా తన ఇమేజ్ను కాపాడుకుంటూనే, పార్టీ లైన్ పాటించడం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది.
జగన్ను మెప్పించలేకపోయిన బొత్స
మండలిలో ఎమ్మెల్సీలను ఏకతాటిపైకి తీసుకురావడం, చైర్మన్ వ్యవహారశైలిపై పోరాడటం వంటి అంశాల్లో బొత్స తన పాత పదును చూపలేకపోతున్నారనే విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో నిరంతరం టెన్షన్లు పడటం కంటే, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడమే మేలని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. అందుకే, ఆయన ఇకపై కేవలం కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదలకు ‘మెంటార్’గా మాత్రమే వ్యవహరిస్తారని, ప్రత్యక్ష ఎన్నికల్లో గానీ, పార్టీ కీలక బాధ్యతల్లో గానీ చురుగ్గా పాల్గొనే అవకాశం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైసీపీ మండలి పక్ష నేతగా వరుదు కల్యాణి?
విజయనగరం జిల్లాలో ఒక వెలుగు వెలిగిన బొత్స శకం ముగిసినట్లేనా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. తన వారసులను రాజకీయాల్లో నిలబెట్టేందుకు వెనుక నుండి చక్రం తిప్పుతూ, ప్రత్యక్ష పోరాటాల నుండి విరామం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అందుకే శాసనమండలిలో విపక్ష నేతగా జగన్ వేరే వారిని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారు. అరుదు కల్యాణి లేదా లేళ్ల అప్పిరెడ్డికి అవకాశం కల్పించాలని ఇప్పటికే నిర్ణయించారని అంటున్నారు.
ఒకవేళ బొత్స నిజంగానే పక్కకు తప్పుకుంటే, ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దిక్కును కోల్పోయినట్లే అవుతుంది.


