ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీని బహిష్కరించిన ఆ పార్టీ, మండలిని వేదికగా చేసుకుని ప్రభుత్వపై విమర్శలు చేయాలని భావిస్తున్నప్పటికీ, అది కాస్తా ఆరోపణలు చేయడం-ఆధారాలు అడగ్గానే పారిపోవడం ‘ అనే చందంగా తయారైంది. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అనుసరిస్తున్న ఈ వ్యూహం చర్చ కంటే కూడా సభ నుంచి తప్పించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రతిరోజూ సభలో ఏదో ఒక అంశంపై ఆరోపణలు చేయడం, దానికి సంబంధించిన వివరణను మంత్రి లోకేష్ లేదా ఇతర మంత్రులు ఇస్తుంటే వినకుండానే బయటకు వెళ్ళిపోవడం వైసీపీకి పరిపాటిగా మారింది. ఇవాళ కూడా మండలిలో అదే తంతు పునరావృతమైంది. ఒక అంశంపై బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విమర్శలు చేయగా, వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ ఆధారాలు చూపాలని, దమ్ముంటే సభలో నిలబడి చర్చకు రావాలని సవాల్ విసిరారు. అయితే, ఆ సవాల్‌ను స్వీకరించి చర్చను ముందుకు తీసుకెళ్లే బదులు, వైసీపీ సభ్యులు వాకౌట్ బాట పట్టింది.
ఇలా వాకౌట్ చేసి పోతున్న వారిని ఆరోపణలు చేసి బయటకు వెళ్లడం కాదు.. మీకు నిజంగానే ప్రజా సమస్యల పట్ల అవగాహన, చిత్తశుద్ధి ఉంటే సభలో ఉండి చర్చించండి అని లోకేష్ సూటిగా సవాల్ చేశారు. ప్రతిపక్షం అంటే కేవలం విమర్శలు చేయడమే కాదు, ప్రభుత్వ సమాధానాన్ని వినే ఓపిక ఉండాలని, కానీ వైసీపీ నేతలు మాత్రం తమ ఆరోపణలకు కౌంటర్ వస్తుందనే భయంతోనే వాకౌట్ అస్త్రం ప్రయోగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
మండలిలో వైసీపీ అనుసరిస్తున్న ఈ హిట్ అండ్ రన్ విధానం వల్ల ప్రభుత్వంపై బురద చల్లేశామన్న సంతృప్తిని మాత్రమే బొత్స మిగుల్చుకుంటున్నారు.