శాసనమండలిలో బొత్స సత్యనారాయణ రాజకీయం వైసీపీ కోసం పోరాడుతున్నట్లుగా ఉందా లేకపోతే ఆ పార్టీ గతంలో చేసిన నిర్వాకాలను మళ్లీ చర్చకు పెట్టాలనే వ్యూహంలో భాగంగా వస్తున్నారా అన్నది టీడీపీకే కాదు.. వైసీపీ సభ్యులకూ సస్పెన్స్ గానే ఉంది. శాసన మండలిలో ఆయన శుక్రవారం ముందుగా రోడ్ల అంశాన్ని ప్రస్తావించారు. రోడ్లు సంక్రాంతి కల్లా బాగు చేస్తామన్నారని.. కానీ అచ్చెన్నాయుడు జిల్లాలోనే రోడ్లు సరిగా లేవన్నారు. ఇక అచ్చెన్నాయుడు ఊరుకుంటారా?. ఆయన లేచి.. బాలకృష్ణ లెవల్లో… ఎక్కడ రోడ్లను పరిశీలిద్దామో చెప్పాలని.. డేట్..టైమ్..ప్లేస్ డిసైడ్ చేయాలని సవాల్ చేశారు.
ఈ క్రమంలో ఆయన వైసీపీ హయాంలో ఐదేళ్లు చేసిన నిర్వాకం, గుంతలు కూడా పూడ్చని వైనం, కనీసం కాంట్రాక్టర్లు కూడా మందుకు రాని వైనాన్ని వివరించారు. ఇది అయిపోయాక కరెంట్ చార్జీల ప్రస్తావన తీసుకు వచ్చారు. కరెంట్ చార్జీలు పెంచబోమన్నారని… పెంచారని ఆరోపించారు. దీంతో అచ్చెన్న మరోసారి యాక్షన్ లోకి వచ్చారు. కరెంట్ చార్జీలు తమ హయాంలో ఒక్క రూపాయి కూడా పెరగలేదని.. పెంచేలా వైసీపీనే ఏర్పాట్లు చేసి పెట్టిపోయిందని.. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం కూడా ఇప్పించి వెళ్లిందని గుర్తు చేశారు. కావాలంటే దీనిపై చర్చకు రావాలన్నారు.
రోడ్లు, విద్యుత్ చార్జీల అంశంపై వైసీపీ నిర్వాకాలను ప్రజలు అంత త్వరగా మర్చిపోరు. అయినా బొత్స సత్యనారాయణ అదే అంశాలను మళ్లీ మండలిలో ప్రస్తావించి ప్రజలందరికీ గుర్తొచ్చేలా చేశారు. ఇదేదో తేడాగా ఉందని వైసీపీ సభ్యులు అనుకుంటారని అనుకున్నారేమో కానీ బొత్స మాత్రం..తనకు మాట్లాడే చాన్స్ ఇవ్వడం లేదని.. నిజాలు చెప్పే అవకాశం ఇవ్వడం లేదని.. అన్నీ వారే మాట్లాడుతున్నారని చెప్పి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ కూడా ఊపిరి పీల్చుకుంది. లేకపోతే ఈ సారి ఏ అంశం తెరపైకి తెచ్చి వైసీపీ నిర్వాకాలను ప్రజల ముందు పెట్టించేవాడో అని కంగారు పడ్డారు.