70 కోట్ల‌కు రూపాయి త‌గ్గ‌నంటున్న బోయ‌పాటి

నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈపాటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే… అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం అయ్యింది. ఈ సినిమా బ‌డ్జెట్ విష‌యంలోనూ ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్న‌ట్టు చెప్పుకున్నారు. ఈ క‌థ‌కు రూ.70 కోట్ల బ‌డ్జెట్ అవ‌స‌రమ‌ని బోయ‌పాటి చెప్పిన‌ట్టు, 40 కోట్ల‌లోపు సినిమాని పూర్తిచేయ‌మ‌ని నిర్మాత అడిగిన‌ట్టు వార్త‌లొచ్చాయి. `విన‌య‌విధేయ‌రామ‌` ఎఫెక్ట్ వ‌ల్లే ఈ సినిమా బ‌డ్జెట్ త‌గ్గ‌బోతోంద‌ని అనుకున్నారు. అయితే బోయ‌పాటి శ్రీ‌ను మాత్రం బ‌డ్జెట్ రూపాయి కూడా త‌గ్గించ‌డానికి ఒప్పుకోవ‌డం లేద‌ట‌. ఈ సినిమాకి 70 కోట్లు ఖ‌ర్చు పెట్టాల్సిందేన‌ని, లేదంటే క్వాలిటీ రాద‌ని నిర్మాత‌కి గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో నిర్మాత కూడా బోయ‌పాటి కండీష‌న్‌కి ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. బోయ‌పాటి సినిమాల్లో యాక్ష‌న్ మోతాదు ఎక్కువ‌గా ఉంటుంది. అందుకోస‌మే భారీగా ఖ‌ర్చు పెడుతుంటాడు. ఈ సినిమాలోనూ యాక్ష‌న్ సీన్లు ఎక్కువే ఉన్నాయ‌ని, అందుకే బడ్జెట్ ఈ స్థాయిలో కావాల్సివ‌చ్చింద‌ని తెలుస్తోంది. టెక్నిక‌ల్ టీమ్ విష‌యంలోనూ బోయ‌పాటి ఏమాత్రం రాజీ ప‌డ‌డు. అందుకే బ‌డ్జెట్‌ప‌రిధులు దాటుతుంటుంది. సింహా, లెజెండ్ టైపులో ఈ సినిమా కూడా హిట్ట‌యితే.. రూ.70 కోట్లు రాబ‌ట్టుకోవ‌డం పెద్ద విశేష‌మేమీ కాదు. అప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు డిజిట‌ల్, శాటిలైట్‌, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ బాగా పెరిగాయి. బోయ‌పాటి న‌మ్మ‌కం కూడా వీటిపైనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com