అఖండ2 సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర స్టడీగా కొనసాగుతోంది. విమర్శకుల నుంచి సినిమాకి మిశ్రమమైన అభిప్రాయాలు వచ్చాయి. సినిమాలో లాజిక్కులు లేవనే ఒక కామన్ కామెంటు ఎక్కువగా వినిపించింది. ఈ విమర్శలపై బోయపాటి ఒక వివరణ ఇచ్చారు. ఒక సూపర్ మాన్ తరహా కథలానే అఖండ పాత్రని చూడాలని చెప్పారు. అదే సమయంలో అష్టసిద్ధి సాధన గురించి చాలా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
”దేశానికి పెద్ద విపత్తు రాబోతుంది. దాన్ని నివారించాలంటే అష్టసిద్ధి సాధన ఒకటే మార్గమని మురళీమోహన్ గారి క్యారెక్టర్ తో ముందే చెప్పాం. అష్టసిద్ధి అంటే మామూలు విషయం కాదు. ఆ సాధన చేసిన వాళ్ళు ఎలాంటి శక్తులు పొందుతారో గూగుల్ చేయండి. సూపర్ హ్యూమన్ ని లాజికల్ గానే చూపించాం. అన్ని కమర్షియల్ సినిమాల్లో ఉన్న యాక్షన్ సీన్లు ఇందులో ఉంటాయి. కానీ ఎక్కడో కాస్త అతీతం లేకపోతే ఈ క్యారెక్టర్ అలా సూపర్ పవర్ గా అవ్వదు. ఇందులో మనిషితో దిష్టి తీసి ఒక సన్నివేశం ఉంటుంది. అష్టసిద్ధి సాధన చేసి వచ్చిన వాళ్ళు తొలిసారి ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఎంత పవర్ ఉంటుందో చూపించడమే ఆ సన్నివేశ ఉద్దేశం’అన్నారు
ఇదే సమయంలో సినిమా వాయిదా పడటం, అభిమానులు ఆగ్రహం గురించి కూడా స్పందించారు. టికెట్ తీసుకొని థియేటర్ కి చేరుకున్న తర్వాత సినిమా వాయిదా అంటే ఎవరికైనా కోపం వస్తుంది. కనీసం ఒక రెండు రోజులు ముందే చెబితే అభిమానులు అర్ధం చేసుకునేవారు. అలాంటి పరిస్థితి రావడం నిజంగా దూరదృష్టకరమే’అన్నారు.
‘14 రీల్స్ ప్లస్’ నిర్మాతలకు మరో సంస్థతో ఆర్థికపరమైన విషయాల్లో సమస్యలు తలెత్తడంతో డిసెంబరు 5న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి 12న వచ్చిన సంగతి తెలిసిందే.
