అఖండ తరవాత.. బోయపాటి శ్రీను తిరుగులేని ఫామ్ లోకి వచ్చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా `అఖండ` రికార్డు సృష్టించింది. ఆ వెంటనే రామ్ తో ఓ సినిమా ప్రకటించి, క్లాప్ కూడా కొట్టేశారు. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. రామ్ తో `వారియర్` తీసిన నిర్మాతలే బోయపాటి శ్రీను సినిమాని తెరకెక్కిస్తున్నారు. వారియర్‌తో బాగా నష్టపోవడం వల్ల బడ్జెట్ సమస్యలు తలెత్తాయని ఇన్ సైడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ఈలోగా గౌతమ్ మీనన్ తో రామ్ సినిమా ఉంటుందని వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో బోయపాటి సినిమా కంటే ముందే.. గౌతమ్ మీనన్ సినిమా పట్టాలెక్కుతుందేమో అన్న ఊహాగానాలు వ్యాపించాయి. అయితే… ముందు బోయపాటి సినిమానే పట్టాలెక్కుతుందని, ఈ విషయంలో సందేహమే అవసరం లేదని బోయపాటి కాంపౌండ్ వర్గాలు ధృవీకరించాయి.
ఈ నెలాఖరున ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది. అయితే… దసరా తరవాతే తొలి షెడ్యూల్ మొదలెట్టాలని తాజాగా నిర్ణయించుకొన్నారట. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాక.. నాన్ స్టాప్ గా షూటింగ్ చేసుకొంటూ పోవాలని బోయపాటి భావిస్తున్నారు. ఈ సినిమాకి రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. రామ్ కెరీర్‌లోనే కాదు, బోయపాటి కెరీర్‌లోనూ ఇదే కాస్ట్లీ సినిమా అవుతుంది.