బ్రహ్మానందం ఈమధ్య వెండితెరపై కనిపించి, నవ్వించీ చాలాకాలమైంది. ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఆయనా అన్ని సినిమాల్నీ ఒప్పుకోవడం లేదు. అలా.. బ్రహ్మీ ఎప్పీరియన్స్… వెండి తెరపై మిస్ అయ్యింది. కానీ.. `రంగమార్తండ`లో తన ఇమేజ్‌కి విభిన్నమైన పాత్రలో కనిపించాడు. చక్రిగా… ఎమోషన్ నిండిన పాత్రలో నటించాడు. బ్రహ్మీకి ఇది కొత్త తరహా పాత్ర. ఓ రకంగా బ్రహ్మానందం తనపై తాను చేసుకొన్న ప్రయోగం. కృష్ణవంశీ అంటే బ్రహ్మానందానికి ప్రత్యేకమైన అభిమానం. ఆయన దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకొంటే.. ఇప్పటికి కుదిరింది. పైగా… ఓ వెరైటీ పాత్ర. అందుకే.. ఈ సినిమా కోసం బ్రహ్మానందం చాలా కష్టపడ్డాడు. రెమ్యునరేషన్ లేకుండా నటించాడు. ఆఖరికి సెట్ కి తన క్యారేజీ తానే తీసుకెళ్లేవాడట. నిజానికి బ్రహ్మానందాన్ని భరించడం చాలా కష్టం అని చెబుతుంటారంతా. ఎందుకంటే ఆయన రెమ్యునరేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది. అయినా సరే, దాన్ని కూడా పక్కన పెట్టి కృష్ణవంశీ కోసం ఈ సినిమా చేశాడు. ఫ్రీగా.
సినిమా విడుదలైంది. చక్రి పాత్రకు మంచి పేరైతే వచ్చింది. కానీ లాభం ఏమిటి? ఈ సినిమాని థియేటర్లో చూసినవాళ్లే లేరు. ఓటీటీలోనూ అంతంత మాత్రమైన స్పందన. బలగంతో పోలిస్తే… రంగస్థలం మెరవలేకపోయింది. ఏ సినిమా అయినా… థియేటర్లో ఆడితేనే మజా. కష్టానికి అప్పుడే ప్రతిఫలం వచ్చినట్టు. పదిమంది చూసి.. బాగుందంటే చాలదు. రివ్యూలు నెత్తిమీద పెట్టుకొంటే సరిపోదు. రిజల్ట్.. ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వాళ్లకు నచ్చితేనే హిట్టు. లేదంటే లేదు. ఈ సినిమా బాగా ఆడితే… బ్రహ్మానందం కెరీర్ గ్రాఫ్ లో ఆకస్మిక మార్పు వచ్చేది. బ్రహ్మీకి వెరైటీ పాత్రలు దక్కేవి. కానీ జరగలేదు. అలా… బ్రహ్మానందం ఎంత కష్టపడినా రిజల్ట్ మాత్రం రాలేదు. ఆయన కష్టం… బూడిదలో పోసిన పన్నీరే.