కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఎపి తెలంగాణ జలవివాదాలు కొంతైనా తగ్గించగలిగితే సంతోషమే. గతంలో ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపుల్లో అన్నాయం జరిగిందని దాని ప్రచురణ నిలిపివేయాలంటూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. ఈ లోగా విభజన జరిగింది. ఇప్పుడు ఇచ్చిన జలాలనే రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకోవడం గాక విడివిడిగా నాలుగు రాష్ట్రాలకూ పంపిణీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా వాదించింది. ఈ వాదనను ఎపి కూడా బలపర్చింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఈ రోజు జస్టిస్ బ్రిజేష్ కుమార్ తన తీర్పులో మొదటి భాగం వెలువరించారు. ఈ పున:పంపిణీ వ్యవహారం ఎపి తెలంగాణలకు తప్ప మిగిలిన రెండు రాష్ట్రాలకూ సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఇక ఈ రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారి కేటాయింపులు చేయడంపై వాదనలు వినిపించాల్సిందిగా కోరింది. డిసెంబర్ 14కు ఈ కేసు విచారణ వాయిదా వేశారు. అంటే అప్పటి వరకూ ప్రస్తుత పద్ధతుల్లోనే పంపిణీ చేసుకోవాలన్నమాట. ఇదెలాగూ సమస్యాత్మకమే అయినా వేరే గత్యంతరం కూడా లేదు.
అలాగే ఈ పేరుతో మిగిలిన రాష్ట్రాలు మొత్తం సమస్యను తిరగదోడేందుకు అవకాశం ఇవ్వలేదు. అదేసమయంలో మిగులు జలాలు నికర జలాలకు సంబంధించి అంతకు ముందు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తలకిందులు చేసిన బ్రిజేష్ కుమార్ మొత్తంగానే అరకొర కేటాయింపులు చేశారు. ఇప్పుడు దాన్ని పరిశీలించడానికి మాత్రం ఆయన సిద్ధంగా లేరన్న మాట.ఎపికి ఇచ్చిననీళ్లను ఎలా పంచుకోవాలన్నదే ఇప్పుడు చర్చంతా.బహుశా దీనిపై న్యాయపోరాటం కొనసాగవచ్చు.అప్పుడు బ్రిజేష్ ఆదేశం మధ్యంతర ఉత్తర్వు వంటిదే అవుతుంది.