తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ, అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణల్లో లోతులకు వెళ్తే.. బీఆర్ఎస్ ఎత్తిచూపుతున్న అనేక వ్యవహారాల మూలాలు వారి పదేళ్ల హయాంలోనే ఉంటున్నాయి. ప్రభుత్వంపై బురద చల్లాలనే తొందరలో, ఆయా నిర్ణయాలు,ఒప్పందాలు తమ హయాంలోనే జరిగాయన్న విషయాన్ని విస్మరించడం వల్ల ప్రతిపక్షం ఇప్పుడు ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది.
నాదర్గుల్ భూములు.. తవ్విన కొద్దీ పాత వాసనలే!
నాదర్గుల్ భూముల విషయంలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ, ప్రభుత్వ వర్గాలు, పాత రికార్డులను బయట పెట్టాయి. సదరు భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ, దానికి సంబంధించిన ఫైళ్ల కదలిక అంతా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పూర్తయ్యాయని తేలింది. ప్రస్తుతం జరిగినవి కేవలం గతంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కొనసాగింపు చర్యలే కావడంతో, బీఆర్ఎస్ ఆరోపణలు గాలిలో కలిసిపోయాయి. చివరకు ఈ అంశంపై నోరు మెదపలేని పరిస్థితి ఆ పార్టీ నేతలకు ఎదురైంది.
అసలు టెండర్లే లేకపోయినా అవినీతి ఆరోపణలు
బీఆర్ఎస్ ఆరోపిస్తున్న హ్యామ్ రోడ్ల నిర్మాణం, హిల్ట్ పాలసీ వ్యవహారాలు కూడా ఇప్పుడు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం హ్యామ్ పద్ధతిలో చేపట్టిన టెండర్లలో అవినీతి జరిగిందని ప్రతిపక్షం గగ్గోలు పెట్టినప్పటికీ, అసలు ఈ విధానానికి శ్రీకారం చుట్టింది, పైలట్ ప్రాజెక్టుల పేరుతో టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. అలాగే హిల్ట్ పాలసీకి సంబంధించిన ముసాయిదాలు కేసీఆర్ హయాంలోనే రెడీ అయ్యాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు రూపొందించిన విధివిధానాలనే ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేస్తుంటే, వాటిని స్కామ్ లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.
మౌనమే సమాధానంగా..
తాము చేసిన ఆరోపణలు తిరిగి తమ మెడకే చుట్టుకుంటుండటంతో, బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు డిఫెన్స్‌లో పడుతున్నాయి. సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేసిన అంశాలపై ప్రభుత్వం ఆధారాలతో సహా కౌంటర్ ఇస్తుండటంతో, అటు నేతలు ఇటు సోషల్ మీడియా వింగ్ మౌనం పాటించాల్సి వస్తోంది. రాజకీయాల్లో అధికార పక్షాన్ని విమర్శించడం ప్రతిపక్ష బాధ్యత అయినప్పటికీ, ఆ విమర్శలు పక్కా ఆధారాలతో ఉండాలి. తమ హయాంలో జరిగిన లోపాలను కూడా ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేయడం వల్ల బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లవుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో బీఆర్ఎస్ చేసే నిజమైన విమర్శలను కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు.
