భారత రాష్ట్ర సమితి రియాలిటీలోకి రావడం లేదు. ప్రభుత్వం విఫలం అయింది అని చెప్పడానికి మాత్రమే వారు రోజంతా కేటాయిస్తున్నారు. అసలు పనులు ప్రారంభించక ముందే ఫెయిల్ అనే ప్రచారం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ తో దాడి చేస్తున్నారు. తమ చేతుల్లో ఉండే మీడియా, సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. అదే సమయంలో తమకు ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. దాని వల్ల ఆ పార్టీ చేస్తున్న రాజకీయం అంటేనే సొంత పార్టీ వాళ్లు కూడా “ ఇదేంటి..బాసూ” అనుకునే పరిస్థితి వచ్చి పడింది.
కోల్కతాలా మెస్సీ ఈవెంట్ జరగాలని ఆశపడిన బీఆర్ఎస్ సోషల్ మీడియా
మెస్సీ ఇండియా టూర్ ..హైదరాబాద్ లో ఫిక్స్ అయిన తర్వాత భారతరాష్ట్ర సమితి డబుల్ డ్యూటీ చేసింది. ఆ మ్యాచ్ కోసం ఉప్పల్ పిచ్ తవ్వేస్తున్నారని.. వంద కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రచారం చేశారు. మెస్సీ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకంపైనా ఆరోపణలు చేశారు. చివరికి మెస్సీ మొదటి మ్యాచ్ కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఫెయిల్ కావడంతో హైదరాబాద్ లోనూ అలాగే జరగాలని ప్రచారం చేశారు. ఫేక్ న్యూస్ తో దాడి చేశారు. మ్యాచ్ ప్రారంభం కాక ముందు నిర్వహణ లోపాలు అని.. ఫెయిల్ అని ప్రచారం చేశారు. మ్యాచ్ జరుగుతూంటే.. తమ గోల తాము పడ్డారు. ఓ వైపు మెస్సీ మానియాతో హైదరాబాద్ ఊగిపోతూంటే.. పాపం బీఆర్ఎస్ కు కాలిపోతోందని ఇతరులు సైటైర్లేసుకున్నారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ పైనా అదే ప్రచారం. తెలంగాణ ఇమేజ్ పెంచే కార్యక్రమాలపైనా దాడి చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపారు..కానీ అతి ప్రచారం
పంచాయతీ ఎన్నికల మొదటి దశలో బీఆర్ఎస్ మరీ తుడిచిపెట్టుకుపోలేదు. 25శాతం వరకూ సర్పంచ్ స్థానాలను గెల్చుకుంది. ఇది నిర్వీర్యం అయిపోతోందన్న పార్టీకి ఊపిరి పోయడమే అనుకోవచ్చు.కానీ ఆ పార్టీ చేసుకునే ప్రచారం ఎలా ఉందంటే.. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.. స్వీప్ చేసేశాం అన్నట్లుగా ఉంటుంది. సిరిసిల్లలో మెజార్టీ స్థానాలను కోల్పోతే.. కొడంగల్ లో గెల్చినా కొన్ని పంచాయతీల సర్పంచ్‌లను పిలిపించుకుని కేటీఆర్.. చాలెంజ్‌లు చేస్తున్నారు. దాన్నే మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో డిపాజిట్ పోనందుకు ఆయన సంతోషపడ్డారు. అలాంటి సంతోషమే పంచాయతీ ఎన్నికలు ఇస్తున్నాయి. కానీ చేసుకుంటున్న ప్రచారం మాత్రం.. ఏదో తేడాగా ఉందే అని అనుకునేలా మారుతోంది.
దాడి చేస్తున్నది రేవంత్ పై కాదు.. తెలంగాణపైనే !
రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన పనితీరు తెలంగాణ ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఆయన పై సోషల్ మీడియా ద్వారా చేస్తున్న దాడి అంతే .. తెలంగాణ కార్యక్రమాలకు సంబంధించినదే. అంటే తెలంగాణపైన ఎటాక్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో లోపాలపై తర్వాత ఎప్పుడైనా చర్చించవచ్చు.. కానీ సమ్మిట్ జరుగుతున్నప్పుడే.. ఫెయిల్..ఫెయిల్ అని ప్రచారం చేశారు. దాంతో తెలంగాణ ప్రయోజనాలు బీఆర్ఎస్ కు అవసరం లేదన్న వాదన ప్రారంభమయింది. మెస్సీతో మ్యాచ్ విషయంలోనూ అంతే. ఫేక్ న్యూస్ తో ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే.. రేపు నిజం చెప్పినా ప్రజలు నమ్మని పరిస్థితి వస్తుంది. అది బీఆర్ఎస్సే తచ్చుకుంటోంది.
