కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్లో ఇంత బేలతనమా?. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ రోడ్లపైకి రాలేదు. కానీ ఆయన పిలుపునిస్తే ఉద్యమం ఉరకలెత్తింది. పదేళ్ల పాటు ఆయన సచివాలయానికి వచ్చింది లేదు.కానీ పాలన పరుగులు పెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎక్కడున్నార సరే బీఆర్ఎస్ ఉరిమే ఉత్సాహంతో పోరాడాలి.కానీ ఇప్పుడేం జరుగుతోంది ?. అసెంబ్లీ నుంచి పారిపోయింది. ఏవేవో కారణాలు చెప్పుకుని తాము అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని చెప్పుకుంది. బీఆర్ఎస్ పరిస్థితి చూసి.. చాలా మంది కోపగించుకోవడం లేదు.. జాలి పడుతున్నారు.
జల వివాదాల చర్చ పెట్టింది కాంగ్రెస్ – మరి పారిపోవడం ఎందుకు ?
ఏపీ జలదోపిడీ.. రేవంత్ సహకారం అనే చర్చ పెట్టింది బీఆర్ఎస్ పార్టీనే. దీన్ని అసెంబ్లీలో చర్చించాలని రేవంత్ నిర్ణయించారు. కానీ ఇప్పుడు చర్చకే వచ్చేది లేదని బహిష్కరించారు. ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ప్రజల్లోకి వెళ్లిపోతుంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీకి రాకపోవడం వల్ల.. రేవంత్ దూకుడును అడ్డుకోలేమని నిర్ణయించుకోవడమే వల్లనే బహిష్కరణ ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత నెల 29న ప్రారంభమైన సమావేశాలకు కేసీఆర్ హాజరైనప్పటికీ, కేవలం ఏడు నిమిషాల పాటు మాత్రమే సభలో ఉండి సంతకం చేసి వెనుదిరిగారు.
రేవంత్‌ను ఎదుర్కోలేమని కేసీఆర్ కూడా అనుకుంటున్నారా?
ఒకప్పుడు సభను తన మాటలతో శాసించిన నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ లేని సభలో రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం తమ వల్ల కాదని భావించే హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు ఈ బహిష్కరణ నిర్ణయానికి మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల లోపాలను ఎండగట్టే అవకాశం ఉంది. పాలమూరు-రంగారెడ్డి, కృష్ణా జలాల అంశంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైన వేళ.. బీఆర్ఎస్ బహిష్కరణ చేయడం ఆ పార్టీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికీ శరాఘాతమే.
పార్టీ క్యాడర్ కు ఇక ధైర్యం ఎలా ?
తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించి, దశాబ్దం పాటు రాష్ట్రాన్ని పాలించిన ఒక పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్యాడర్ కూ ఇబ్బందికరంగానే ఉంటుంది. వారికి దైర్యం కలిగించడం పెద్ద సమస్యే అనుకుంటున్నారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలు బీఆర్ఎస్ అగ్రనేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో సభలో ఉండి తమ నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి, రణక్షేత్రం నుండి పారిపోవడం వల్ల పార్టీ కేడర్ లో కూడా నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. ఇది బీఆర్ఎస్ వ్యూహాత్మక తప్పిదంగానే ఉండబోతోంది.
