మహా టీవీపై దాడి చేసి.. తర్వాత ఏబీఎన్ సంగతి తేలుస్తామని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసిన ప్రకటనలు రివర్స్ అయ్యాయి. ఆంధ్రజ్యోతితో పాటు మరికొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. చివరికి ఎన్టీవీ కూడా అదే బాటలో ఉంది. టీవీ9 ఎప్పటి నుంచో న్యూట్రల్ నాటకాలు వేస్తోంది. నేరుగా మద్దతిచ్చి.. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లేందుకు రెడీగా లేదు. అంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తమ సొంత మీడియా తప్ప ఏ మీడియా మద్దతు లేకుండా పోయింది.
ఆంధ్రజ్యోతికి, ఆర్కేకు కాంగ్రెస్, బీజేపీ పోటీ పడి మద్దతు పలుకుతున్నాయి. బండి సంజయ్ అయితే.. ఏబీఎన్ పై దాడి చేస్తే తాము తెలంగాణ భవన్ పై దాడి చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ తీరుపై మండిపడుతున్నారు. మీడియాపై దాడులు సరి కాదని.. నేరుగా ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి సంఘిభావం చెబుతున్నారు. అసలు మహా న్యూస్ ఇష్యూలో .. ఏబీఎన్ కు సంబంధమే లేదు. వారు ఎలాంటి అభ్యంతరకర థంబ్ నెయిల్స్ పెట్టలేదు. అనవసరంగా ఈ వివాదంలోకి ఏబీఎన్ ను తీసుకు వచ్చి దాడి చేస్తామని హెచ్చరించారు.
దాన్ని వేమూరి రాధాకృష్ణ .. మరింత పెద్దది చేశారు. తన వీకెండ్ కామెంట్ మొత్తం.. బీఆర్ఎస్ నేతల బెదిరింపులకే పరిమితం చేసి.. మరుగుజ్జు నేతలని.. ఎవరు దాడులు చేసినా.. వెనక్కి తగ్గేది ఉండదని సంకేతాలు ఇచ్చారు. సోషల్ మీడియా బెదిరింపులే తప్ప.. ఏబీఎన్ పై దాడులు చేసేంత ధైర్యం బీఆర్ఎస్ చేయదు. అయితే దాడులు బెదిరింపులు వచ్చినా భద్రత కల్పించలేదని విమర్శలు వస్తాయి కాబట్టి పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
ఇప్పుడు బీఆర్ఎస్కు మీడియా శత్రువుగా మారిపోయింది. పాజిటివ్ గా రాయాల్సిన అంశాలకూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంటే.. దాన్ని బయట పెట్టేబాధ్యత తీసుకునే మీడియా ఇప్పుడు సాఫ్ట్ నెస్ ప్రదర్శించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీకి మేలు కలిగేలా చేస్తుంది కానీ బీఆర్ఎస్ పై కనీస సానుభూతి కూడా చూపించదు. ఇలాంటి పరిస్థితి తెచ్చుకుని బీఆర్ఎస్ ఏం సాధిస్తుంది ?. వ్యతిరేక వార్తలు తగ్గుతాయని అనుకుంటే అంత కంటే చిత్తభ్రమ ఉంటుందా ?