రాజకీయ గెలుపోటములు పూర్తిగా భావోద్వేగాల మీదనే ఆధారపడిఉంటాయి. ఏదైనా రాజకీయ పార్టీ ప్రజల్లో ఓ ఎమోషన్.. అదీ అందరికీ కనెక్టయ్యే ఎమోషన్ సృష్టించగలిగితే విజయాలు లభిస్తాయి. నాడు ఎన్టీఆర్ తెలుగోళ్లం అనే సెంటిమెంట్ రేపినా.. కేసీఆర్ తెలంగాణ అనే ఆయుధాన్ని వెదికి తెచ్చుకున్నా…భారతీయజనతా పార్టీ హిందూత్వం అనే వాదనతో తిరుగులేని విజయాలు సాధిస్తున్నా.. దాని వెనుక వారు ఎన్నుకున్న అంశాల్లో ఉన్న ఎమోషన్ ప్రజల్లో టచ్ చేయడమే. అయితే కొన్నింటినీ ప్రతీ సారి వాడలేరు. వాటికి కాల పరిమితి ఉంటుంది. అలాంటి వాటిని ఉపయోగించుకుని మళ్లీ మళ్లీ రాజకీయాలు చేయాలనుకోవడం అమాయకత్వమే. ఇప్పుడు బీఆర్ఎస్ అదే చేస్తోంది. కానీ బీజేపీ ఎత్తుకున్న ఎమోషన్పై ప్రజలకు ఇంకా విరక్తి రాలేదు. అందుకే ఆ పార్టీకి తెలంగాణలో అడ్వాంటేజ్ కనిపిస్తోంది.
తెలంగాణ సెంటిమెంట్ అంటించలేకపోతున్న బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్లమెంట్ ఎన్నికల్లో పరువు పోయాక భారత రాష్ట్ర సమితికి తాము నిలబడాలంటే… తెలంగాణవాదం ఒక్కటేనని అర్థమయింది. అప్పటికే తమ పార్టీ పేరును బీఆర్ఎస్ అని మార్చుకోవడంతో ఆ పార్టీ తెలంగాణపై పేటెంట్ కోల్పోయింది. అప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే మాది అని తెలంగాణ ప్రజల మనసుల్లో ఉండేది. ఆ తర్వాత ఆ భావన పోయింది. పార్టీలో తెలంగాణ పేరు తీసేయడంతో పేరు బంధం కూడా తెగిపోయింది. అయినప్పటికీ మళ్లీ తాము మాత్రమే తెలంగాణకు సేవియర్లం అని.. లేకపోతే ప్రజలు అన్యాయమైపోతారని రాజకీయాలు ప్రారంభించారు. కానీ అసలు టీఆర్ఎస్ ప్రారంభించింది రాష్ట్ర సాధన కోసం. అది సాధించేసిన తర్వాత పునర్నిర్మాణం పేరుతో పదేళ్లు సెంటిమెంట్ లైవ్ లో ఉండగలిగారు. కానీ దాన్ని కొనసాగించలేకపోయారు. ఇప్పుడు ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ లేదు. రగిలించగలిగే అర్హత కూడా బీఆర్ఎస్ కోల్పోయింది. కానీ బీఆర్ఎస్ కు ఆ ఆయుధం తప్ప మరో ఆప్షన్ లేదు. అందుకే దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. ఎంతగా అంటే… ఎవరో ఎవరికో ఇచ్చిన మ్యాప్ లో .. తెలంగాణ ను గుర్తించలేదని నేరుగా ప్రధానిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసేంత.
చాపకింద నీరులా విస్తరిస్తున్న జాతీయవాదం, హిందూత్వం
మరో వైపు భారతీయ జనతా పార్టీ రాజకీయంగా రోడ్డెక్కి ఉద్యమాలు చేయడం లేదు కానీ ఆ పార్టీ విస్తరణ మాత్రం ఆగడం లేదు. బీజేపీ రాజకీయాలు ఎప్పుడూ భిన్నమే. ప్రజాపోరాటాలు అంటే రోడ్డెక్కి గొంతు చించుకోవడం కాదు. వారికి స్పష్టమైన దిశానిర్దేశం పై నుంచి వస్తుంది. ఆరెస్సెస్ వంటి విభాగాల సంపూర్ణ మద్దతు ఉంటుంది. వారంతా.. తమదైన జాతీయవాదం, హిందూత్వాన్ని కింది స్థాయి వరకూ విస్తరింప చేస్తూ ఉంటారు. అందుకే త్రిపుర, బెంగాల్ వంటి చోట్ల కూడా బీజేపీ విజయాలు సాధించింది. తెలంగాణలోనూ అదే విధంగా చాప కింద నీరులా విస్తరించుకుంటూ పోతున్నారు. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే పట్టు సాధించేశారన్న భావనలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉంది. దక్షిణ తెలంగాణపై దృష్టి సారించారు.
ప్రజల్ని ఒకే ఎమోషన్తో కట్టి పడయలేరు !
తెలంగాణ రాష్ట్రం అనే ఎమోషన్ తో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోంది. కానీ రాష్ట్ర ఏర్పాటుతో ఆ ఎమోషన్ కు కాలపరిమితి ముగిసింది. ప్రజలు కూడా అదే భావోద్వేగానికి కట్టుబడి ఉండే పరిస్థితి లేదు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు, సామాజిక నేపధ్యాలను పక్కాగా విశ్లేషించుకున్న బీజేపీ జాతీయవాదం, హిందూత్వంతో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు బీజేపీదే పై చేయిగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొత్తం బీజేపీకి పోవడం యాధృచ్చికం కాదు. బీఆర్ఎస్ బలహీన అభ్యర్థుల్ని నిలబెట్టడం వల్ల వచ్చిన ఫలితం కాదు. తెలంగాణ వాదం అనే భావోద్వేగం ఉన్నప్పుడు కేసీఆర్ ఎవర్ని పెట్టినా అభ్యర్థిని చూడకుండా ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు వేయలేదు అంటే.. వచ్చిన మార్పు అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం క్లియర్ గా మారుతోంది. భావోద్వేగాల రాజకీయంలో బీఆర్ఎస్ పూర్తిగా వెనుకబడిపోయింది. బీజేపీ ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ ఇది ఉనికి సమస్యలు తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.