రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజం, కానీ ఆ విమర్శల్లో అర్థం, పరమార్థం ఉండాలి. ప్రత్యర్థి అంటే.. ప్రతీ దాన్ని విమర్శించేయాలని కాదు. అలాగని పొగడలేరు. పాగడాల్సిన పరిస్థితి వస్తే సైలెంటుగా గా ఉంటే మంచిది . కానీ అలాంటి సందర్భాల్లోనూ తప్పులు వెదికే ప్రయత్నం చేస్తే నవ్వుల పాలవుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అదే. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో నాయకత్వ కోర్సు కోసం వెళ్లిన అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు ఇలాగే ఉన్నాయి. ఒక నాయకుడు తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీకి వెళ్లడాన్ని స్వాగతించకపోయినా పరవాలేదు కానీ, దానిపై బురదజల్లే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉంది.
తనకు లభించిన అరుదైన గౌరవం అని చెప్పుకోని రేవంత్
రేవంత్ రెడ్డి తనకు హార్వార్డ్ నుంచి ఆహ్వానం అందిందని గొప్పలు చెప్పుకోలేదు. తనపాలనను మెచ్చి పిలిచారని చెప్పుకోలేదు ఆయన తన సొంత ఆసక్తితో, ఒక విద్యార్థిగా నేర్చుకోవడానికి వెళ్లారు. అయితే, దానికి కట్టిన ఫీజు ఎంత? ఆయన ఎన్ని రోజులు ముందు వెళ్లారు? ఎక్కడ ఉంటున్నారు? వంటి వ్యక్తిగత , అప్రస్తుత విషయాలను బీఆర్ఎస్ తెరపైకి తీసుకురావడం వారి రాజకీయ అపరిపక్వతను సూచిస్తోంది. నేర్చుకోవాలనే తపనను అభినందించకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి మైక్రో లెవల్ విమర్శలకు దిగడం వల్ల ప్రజల్లో ఆ పార్టీపై ఉన్న గౌరవం తగ్గే ప్రమాదం ఉంది.
విమర్శించడానికి బోలెడు ప్రభుత్వ సమస్యలు
ప్రజాస్వామ్యంలో విపక్షం అనేది ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగట్టాలి. కానీ, రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిని – అది వ్యక్తిగతమైనా, వృత్తిపరమైనా – తప్పు పట్టాలనే ధోరణి బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ప్రతిదానికీ విమర్శేనా? అనే భావన సామాన్య జనంలో కలిగితే, రేపు నిజంగా ప్రభుత్వం ఏదైనా పెద్ద తప్పు చేసినప్పుడు విపక్షం గొంతు ఎత్తినా ప్రజలు దానిని సీరియస్ గా తీసుకోరు. అతిగా విమర్శించడం వల్ల ఆ విమర్శకు ఉండాల్సిన పదును తగ్గిపోతుంది.
ఒకప్పుడు పరిపాలనలో తమదైన ముద్ర వేసిన బీఆర్ఎస్ వంటి పార్టీ, ఇప్పుడు ఇలాంటి చిన్నపాటి విషయాలపై దృష్టి పెట్టడం ఆ పార్టీ సరైన ట్రాక్‌లోనే వెళ్తోందా అన్న ప్రశ్నలు సొంత క్యాడర్లో రావడానికి కారణం.
విమర్శించాల్సిన వాటిని లైట్ తీసుకుంటున్నారా?
నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం అనేది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మంచిదే అని గుర్తించలేకపోవడం వారి సంకుచితత్వాన్ని చూపిస్తోంది. ఇలాంటి తీరు కొనసాగితే, ప్రజలు బీఆర్ఎస్ మాటలను “లైట్” తీసుకోవడం మొదలుపెడతారు. ప్రత్యర్థి వేసే ప్రతి అడుగులోనూ తప్పు వెతకడం మానేసి, నిర్మాణాత్మకమైన విమర్శలు చేసినప్పుడే రాజకీయాల్లో గౌరవం దక్కుతుంది. రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిని విమర్శిస్తే ప్రజలు కూడా …బీఆర్ఎస్ తీరు అంతే అని లైట్ తీసుకునే అవకాశం ఉంది.
