భారత రాష్ట్ర సమితి రాజకీయాల ఓ కొలిక్కి రావడం లేదు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ముఖ్యనేతలతో వరుసగా చర్చలు జరుపుతున్నారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి వారం రోజులు అవుతోంది. ఆయనతో పాటు హరీష్ రావు కూడా రెండు రోజులుగా ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నారు. రోజుల తరబడి చర్చిస్తున్నారు కానీ.. ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న దానిపై స్పష్టత లేదు. కానీ లీకులు మాత్రం వస్తున్నాయి.
సీబీఐ దర్యాప్తు ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న మొదటి సవాల్
కాళేశ్వరం విషయంలో సీబీఐ ఏం చేస్తుందన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు తెలియడం లేదు. సీబీఐ విచారణకు కోర్టు అడ్డంకులు కూడా లేవు. సీబీఐ డైరక్టర్ కూడా హైదరాబాద్ వచ్చి స్థానిక అధికారులతో మాట్లాడారు. ఏం మాట్లాడారు…. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఎప్పుడు అంశంపై ఆదేశాలు ఇచ్చారా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఆయన పర్యటన బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠకు కారణం అవుతోంది. ఎప్పుడు కేసు నమోదు చేస్తుందో.. ఎప్పుడు విరుచుకుపడుతుందో అర్థం కాని పరిస్థితి.
తెమల్చలేనంత చర్చలు దేని కోసం ?
కేటీఆర్ ఏడెనిమిది రోజులుగా ఫామ్ హౌస్‌లోనే ఉన్నారు. మరీ స్తబ్దుగా లేము అని చెప్పుకునేందుకు చిన్న చిన్న కార్యక్రమాలు అక్కడే ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంత మంది చోటామోటా నాయకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు ఫామ్ హౌస్‌కే పిలిపించుకుని ఆ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు . హరీష్ రావు లండన్ నుంచి వచ్చిన రోజు నుంచి ఫామ్ హౌస్ చర్చల్లోనే ఉన్నారు. అంతగా తెమల్చలేనంత చర్చలు ఏం జరుగుతున్నాయన్నది ఆహ్వానం లేని ముఖ్య నేతలకూ అర్థం కావడం లేదు.
కేసీఆర్ ఇప్పుడల్లా బయటకు వచ్చే చాన్స్ లేనట్లే !
కేటీఆర్ ను జిల్లాల పర్యటన చేయమని కేసీఆర్ సూచించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు ఆదివారం లీక్ ఇచ్చాయి. గద్వాలలో బహిరంగసభకు ప్లాన్ చేశారు. ముందుగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అంటే కేసీఆర్ ఇక బయటకు రానట్లే. కేసీఆర్ ఎప్పుడు నేరుగా రాజకీయాలు చేస్తారన్నది క్యాడర్ కు స్పష్టత లేదు. రాను రాను ఆయన వచ్చినా పెద్దగా మార్పేమి ఉంటుందన్న పరిస్థితి వస్తే.. అప్పుడు కేసీఆర్ వచ్చినా హైప్ ఉండదని కంగారు పడుతున్నారు.