భారత రాష్ట్ర సమితికి పెద్ద గండం వచ్చి పడింది. టీఆర్ఎస్ నుంచి పేరును బీఆర్ఎస్ కు మార్చుకున్న తర్వాత మొత్తం కోల్పోయారు. ఇప్పుడు తప్పు దిద్దుకునేందుకు తెలంగాణకు తమ పార్టీ పూర్తి పేరు చెప్పకుండా.. తామే సంరక్షకులం అని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతి దానికి తెలంగాణ కోణం జోడిస్తూ.. మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వారి తెలంగాణ వాదానికి మరో లిట్మస్ టెస్టు ఉపరాష్ట్రపతి ఎన్నికల రూపంలో ఎదురయింది.
రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారో.. లేకపోతే బీఆర్ఎస్ దరిద్రం అలా ఉందో కానీ.. ఇండీ కూటమి అభ్యర్థిగా తెలంగాణ కు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు అయింది. ఇప్పుడు తెలంగాణ బిడ్డ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తే మద్దతివ్వరా..అన్న ప్రశ్న వస్తోంది. ఆయనకు మద్దతు ఇస్తే కాంగ్రెస్ కు సపోర్టు చేసినట్లవుతుంది. ఒక వేళ తెలంగాణ సెంటిమెంట్ కోసం ఆయనకు కాంగ్రెస్ తో సంబంధం లేదు కాబట్టి మద్దతిస్తున్నామని ప్రకటిస్తే బీజేపీకి కోపం వస్తుంది.
ఇప్పుడు బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు బీఆర్ఎస్. అంతేనా.. విలీన ప్రకటనలు, చర్చలు నడుస్తున్నాయి. ఏది నిజమో తెలియదు కానీ.. బీజేపీని మాత్రం ఎదిరించేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఇప్పుడు ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోనుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం ఎంత ఫార్సో.. ప్రజల ముందు పెట్టేందుకు మంచి అవకాశంగా వాడుకోనుంది. సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వకపోతే తెలంగాణకు ఇవ్వనట్లేనని ప్రచారం చేయబోతోంది. దీనికి బీఆర్ఎస్ దగ్గర కౌంటర్ ఏముందో మరి ?