బీఆర్ఎస్ హయాంలో తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ భూకబ్జాలకు కేంద్రంగా మారిందని తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తాజాగా ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో తేలినట్లుగా తెలుస్తోంది. సిద్దిపేట, సిరిసిల్ల వంటి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు.
ధరణితో 15వేల ఎకరాల్లో అక్రమాలు?
రికార్డులు సరిగ్గా లేని భూములు, వివాదాస్పదమైన ఖరీదైన ఆస్తులను ఒక మాఫియాగా ఏర్పడి నిబంధనలకు విరుద్ధంగా తమ పేర్ల మీదకు మార్చుకున్నట్లు ప్రాథమిక నివేదిక స్పష్టం చేస్తోంది. అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు మరియు నిషిద్ధ జాబితా లో ఉన్న భూములను అత్యంత రహస్యంగా ధరణి రికార్డుల నుంచి తొలగించి, ప్రైవేటు వ్యక్తుల పేర్లపైకి మార్చినట్లుగా బయటపడిందని చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి పరిధిలో సుమారు 15,000 ఎకరాల పైచిలుకు ప్రీమియం భూములు అక్రమాలకు గురైనట్లు లెక్కలు తేలాయని నివేదికలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
లక్ష కోట్లకుపైగా విలువైన భూముల గోల్ మాల్
వీటి విలువ అక్షరాలా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. అర్థరాత్రి వేళల్లో పోర్టల్ ఓపెన్ చేసి డేటాను మార్చడం, విదేశాల నుంచి సర్వర్లను ఆపరేట్ చేయడం వంటి తీవ్రమైన అంశాలను విచారణాధికారులు గుర్తించారు. ఇటీవల మీడియాలో వస్తున్న సత్యం స్కాం భూముల వ్యవహారం కూడా ఈ నివేదికలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. గతంలో వివాదాల్లో ఉండి, రిజిస్ట్రేషన్లకు వీలులేని భూములను ధరణిలోని మోడ్యూల్స్ మార్పుల ద్వారా బీఆర్ఎస్ పెద్దలకు అనుకూలంగా మార్చినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,848 ట్రాన్సాక్షన్లలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని నివేదికలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
ముందు ముందు ధరణి సీరియల్ ?
ఈ నివేదికను ప్రభుత్వం పూర్తిస్థాయిలో బహిర్గతం చేస్తే, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పేరుతో సీరియల్ ను నడుపుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు..తర్వాత ధరణి స్కాంలపై సీరియల్ నడిచే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
