రాజకీయాల్లో ఆవేశం ఎప్పుడూ విజయం సాధించదు. ఆలోచనతోనే పనులన్నీ చక్కబడతాయి. ఈ సూక్ష్మం తెలియకపోతే పరుగు పెట్టక ముందే బోర్లా పడిపోతారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పరిస్థితి అలాగే ఉంది. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక, ఆ వెంటనే జరగనున్న గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు ముందు పెట్టుకుని.. ఆంధ్రా వాదం వినిపిస్తున్నారు. ఎలా బతుకుతారని.. ప్రశ్నిస్తున్నారు. మీడియాపై దాడి కోసం ఆంధ్రా వాదం తీసుకురావడమే పెద్ద పొరపాటు అనుకుంటే దాన్ని ఇంకా అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. తెలంగాణ మా జాగీరే అని రెచ్చిపోతున్నారు. దీన్ని ఇతర పార్టీలు వినోదంగా చూస్తున్నాయి. బీఆర్ఎస్ ఎంతగా రెచ్చిపోతే అంత మంచిదని అనుకుంటున్నాయి.
దోచుకెళ్లిపోతున్నారని అంటే నమ్మేస్తారా ?
మాట్లాడితే దోచుకెళ్లిపోతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటూంటారు. దిగువరాష్ట్రం నీళ్లు ఎలా దోచుకుంటుందో చెప్పరు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకుని గోదావరి నీళ్లు మళ్లించుకుంటే ఎవరూ అడగకూడదు. కానీ ఆపుకున్నన్ని నీళ్లు ఆపుకుని దిగువకు.. సముద్రంలోకి పోయే నీటిని మళ్లించుకుంటే మాత్రం దోచుకున్నట్లే అవుతుంది. ఇది తెలంగాణ ప్రజల్ని పావులుగా ఆడుకుని చేసే రాజకీయం. ఈ విషయం పై ప్రజలకు స్పష్టత ఉంది కాబట్టే వారు రెచ్చిపోవడం లేదు. తెలంగాణ సమాజాన్ని దోచుకున్నదెవరో వారికి క్లారిటీ ఉంది. అందుకే వారి పప్పులు ఉడకడం లేదు. పైగా రివర్స్ అవుతోంది.
రాజకీయాల కోసం ఆంధ్రాపై విషమా?
మీడియాలో తమకు వ్యతిరేకంగా వార్తలు వస్తే ఆంధ్ర మీడియా అంటారు. ఆంధ్రజ్యోతి అని పేరు ఉంటే తప్పంటారు. అఖిలభారత సర్వీసుల్లో పని చేసిన మాజీ పోలీసు అధికారిదీ అవే మాటలు. ఇలాంటి మాటల వల్ల వారికి రాజకీయంగా లాభం వస్తుందని అనుకుంటున్నారో లేదో తెలియదు కానీ.. రాబోయే జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో మాత్రం చాలా పెద్ద ఎఫెక్ట్ పడనుంది. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో కూడా వారికి గతంలో ఉన్న మద్దతు లభించే అవకాశం లేదు. సాధారణ ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.
పార్టీ పేరులో తెలంగాణ తీసేసిన విషయం ప్రజలు మరచిపోతారా ?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. తెలంగాణకు ఏం చేయగలమో అంతా చేశామని ఇక మాది జాతీయ వాదమని చెప్పి కేసీఆర్.. పార్టీ పేరుతో తెలంగాణ తీసేశారు. అన్నీ ఆలోచించే ఆయన ఆ పని చేసి ఉంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినందున ఇక ప్రజలు తెలంగాణ సెంటిమెంట్‌కు ఓట్లు వేయరని ఆయనకు క్లారిటీ ఉంది. అందుకే .. మన పార్టీ..జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు మద్దతు ఇస్తారని పార్టీ పేరు మార్చారు. కానీ కేసీఆర్ లెక్కలు తారుమారయ్యాయి. అందుకే ఇప్పుడు మళ్లీ తెలంగాణ వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. అది కూడా అనుచిత మాటలు, దాడులతో. ఇలాంటివి ఉద్రేకం తెస్తాయని నమ్ముతున్నారు.
కానీ జరుగుతోంది వేరు. ప్రజల్లో ఈ సెంటిమెంట్ రాజకీయాలు ..ఉద్రేకం సృష్టించే అవకాశాలు లేవు. సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక ప్రపంచం ఏర్పాటు చేసుకుని.. అదే నిజం అనుకుని బతికేస్తే.. రియాలిటీ అనుభవించిన తర్వాత ..చేయడానికి ఏమీ ఉండదు. కానీ ఇప్పటికీ బీఆర్ఎస్ ట్రాప్‌లో పడిపోయింది. బయటకు రావడం కష్టమే.