బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవారు. రాష్ట్రం మొత్తం తిరిగేవారు. పార్టీకి ఎంత బలం ఉందన్నది కాకుండా.. తన సొంత ఇమేజ్ ద్వారా ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఐపీఎస్ అధికారిగా స్వేరో వంటి వాటిని నిర్మించుకుని ఓ బలగాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. రేవంత్, కేటీఆర్, బండి సంజయ్ వాంటి వారితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా తర్వాత వరుసలో చెప్పుకునేంత ప్రముఖ స్థానంలో ఉండేవారు. కానీ ఇప్పుడేమయింది ?
బీఆర్ఎస్లో అప్రాధాన్య లీడర్‌గా ప్రవీణ్ కుమార్
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవిని వదిలేసి.. ఎంపీ అయిపోదామని.. బీఆర్ఎస్ లో చేరారు ప్రవీణ్ కుమార్. నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అది కూడా మూడో స్థానంతో సరి పెట్టుకున్నారు. ఇంత ఘోరంగా ఓడిపోతానని ఆయన అనుకోలేదు. పార్టీ పరంగా ఇస్తామన్న సహకారం ఇవ్వలేదని ఆయనపై అందరూ సానుభూతి చూపించారు. కేసీఆర్ కూడా ప్రచారం చేయలేదు. ఇలా సొంత ఐడెంటీటీని వదులుకుని బీఆర్ఎస్లో చేరితే ఆయన ఆ పార్టీలో ఓ ప్రాధాన్య లీడర్‌గా మారిపోయారు.
ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వని కేసీఆర్
చట్టసభలకు పంపుతామన్న హామీతోనే ఎర్ఎస్పీ బీఆర్ఎస్లో చేరి ఉంటారు. అధికారంలో లేని బీఆర్ఎస్ చట్టసభలకు పంపే అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. అయితే అవకాశం వచ్చినప్పుడు ఆ చాన్స్ పార్టీలు మారే దాసోజు శ్రవణ్ కు ఇచ్చారు కానీ.. ఆర్ఎస్ ప్రవీణ్ ను పట్టించుకోలేదు. ఆయన పేరును పరిశీలిస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం చేశారు. ఓ దశలో ఆయన పేరు ఖరారు అయిందన్నారు. కానీ అలాంటిదేమీ లేదని..దాసోజుకు ఇచ్చేశారు. ఇప్పుడు ఆర్ఎస్పీ వచ్చే ఎన్నికల వరకూ వెయిట్ చేయక తప్పదు. అప్పటి వరకూ పార్టీలో ఉంచుతారా లేదా అన్నదే సందేహం.
పార్టీలో తరచూ అవమానాలు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్లో అనుకూల పరిస్థితులు లేవు. ఆయనకు అవమానాలు ఎదురవుతాయి. యశోదా ఆస్పత్రిలో కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి ఆయనను పిలిచినా.. వేరుగా కుర్చీ వేసి కూర్చోబెట్టడం వివాదాస్పదమయింది. ఆయనను అవమానించాలని కాదని..యాధృచ్చికంగా జరిగిందని బీఆర్ఎస్ వివరణ ఇస్తోంది. కానీ పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతాయని రాజకీయ వ్యవహారాల్లో అనుభవం ఉన్న వారు చెబుతారు. ఎలా చూసినా.. ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ కు.. బీఆర్ఎస్లో అంత అనుకూల పరిస్థితి లేదు. ఆయన పై అనుమానంతో .. తగ్గిస్తున్నారో లేకపోతే ఆయన ఎదిగిపోతారని తగ్గిస్తున్నారో ..బీఆర్ఎస్ నేతలకే తెలియాలని ప్రవీణ్ అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.