తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం బిఆర్ఎస్ వర్సెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా పొంగులేటిని టార్గెట్ చేయడం వెనుక బలమైన రాజకీయ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక కీలక విషయాన్ని లేవనెత్తారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని అక్రమ వ్యవహారాలు, కొత్త ప్రాజెక్టుల విషయంలో బిఆర్ఎస్ నేతలు చేస్తున్న పైరవీలకు పొంగులేటి అడ్డుపడుతున్నారని, అందుకే ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
గతంలో తమకు అనుకూలంగా ఉన్న వ్యవస్థలను పొంగులేటి ఇప్పుడు ప్రక్షాళన చేస్తుండటంతో, తమ పనులు కావడం లేదన్న కోపంతోనే బిఆర్ఎస్ పెద్దలు పొంగులేటి అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారని అధికార పక్షం వాదన. పొంగులేటిని ఒత్తిడిలోకి నెట్టడం ద్వారా తమ పాత పనులను చక్కబెట్టుకోవాలనే వ్యూహం ఇందులో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, బిఆర్ఎస్ నేతలు మాత్రం పొంగులేటిపై అక్రమ మైనింగ్ అనే అస్త్రాన్ని బలంగా ప్రయోగిస్తున్నారు. కేవలం అసెంబ్లీకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం, గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా దీనిని ఒక పెద్ద స్కామ్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
పొంగులేటి వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీయడం ద్వారా ఆయన రాజకీయ ప్రభావాన్ని తగ్గించవచ్చని బిఆర్ఎస్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. గతంలో తమ పార్టీలో ఉన్న వ్యక్తి కావడంతో, ఆయన బలహీనతలు తమకు తెలుసని, అందుకే పకడ్బందీగా ఆధారాలతో దాడి చేస్తున్నామని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే, ఇది నిజంగా అవినీతిపై పోరాటమా లేక రాజకీయ కక్షసాధింపా అన్నది ప్రజల్లో చర్చనీయాంశమైంది.
రాజకీయంగా చూస్తే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ తీశారు. గత ఎన్నికల్లో అక్కడ బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ అవ్వడానికి ఆయనే ప్రధాన కారకుడు. భవిష్యత్తులో కూడా ఆయన తన పట్టును పెంచుకుంటే బిఆర్ఎస్ ఆ జిల్లాలో కోలుకోవడం అసాధ్యం. అందుకే, ఆయనపై అవినీతి ముద్ర వేయడం ద్వారా ప్రజల్లో ఆయన ఇమేజ్ను దెబ్బతీయాలనేది బిఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కంటే పొంగులేటిని టార్గెట్ చేయడం వల్ల అటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చు, ఇటు తమ బద్ధశత్రువుపై పగ తీర్చుకోవచ్చు అనే వ్యూహం అమలు చేస్తున్నారని భావిస్తున్నారు.