బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఒక క్లిష్టమైన సవాలుగా మారింది. ఆమెను డీల్ చేసే విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అది పార్టీ మనుగడకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కవిత విషయంలోఇతర పార్టీ నేతలతో వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. మీడియా, సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేయడం కవితకే కలసి వస్తోంది. అది పార్టీకి క్షేత్రస్థాయిలో మేలు చేయడం కంటే నష్టమే ఎక్కువ చేకూర్చేలా కనిపిస్తోంది.
కవిత విషయంలో పక్కా రాజకీయం అవసరం
కవితను హ్యాండిల్ విత్ కేర్.. ఎంత నిర్లక్ష్యంగా డీల్ చేస్తే.. అంత ఘోరంగా మారుతుంది బీఆర్ఎస్ పరిస్థితి. భారత రాష్ట్ర సమితికి కవిత నుంచి పెను ముప్పు పొంచి ఉంది. ఆమెతో వ్యవహరించాల్సిన తీరులోతేడా వస్తే బీఆర్ఎస్ పై సొంత క్యాడర్ లోనే వ్యతిరేకత పెరుగుతుంది. మీడియా, సోషల్ మీడియాలో నిందలు, ఆరోపణలు, తిట్ల ద్వారా కవిత అనుకునే క్రేజ్ తీసుకు వస్తారు. కానీ ఆమె వల్ల నష్టం జరగకూడదంటే.. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కవిత అంటే ఎంతో అభిమానిస్తామని.. కానీ ఆమె రాజకీయ అత్యాశతోనే వెళ్లిపోయారని ప్రజలు అనుకునేలా చేయగలగాలి. తేడా వస్తే.. కవితను మరింత రాజకీయంగా బలపరిచినట్లే అవుతుంది.
కవిత గౌరవానికి భంగం కలగనివ్వకూడదు !
కవిత పట్ల పార్టీ శ్రేణుల్లో ఉన్న అభిమానాన్ని .. ఆమెను కేసీఆర్ కుమార్తెగానే చూస్తారన్న అంశాన్ని మర్చిపోకూడదు. ఆమె పట్ల వ్యక్తిగత గౌరవం ఉన్నప్పటికీ, ఆమె రాజకీయ అత్యాశ వల్లే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయని ప్రజలు భావించేలా చేయగలిగితేనే బీఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. లేనిపక్షంలో, కేవలం ఒక వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో పార్టీ తన సొంత క్యాడర్లోనే వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది. అలా చేయడం అంటే కవితను రాజకీయంగా అతిగా ప్రమోట్ చేయడమే అవుతుంది.
కుటుంబ సమస్యగానే ట్రీట్ చేయాలి !
తెలంగాణ ప్రజల సమస్యలను పక్కన పెట్టి, కేవలం కుటుంబ రాజకీయాల్లోనే బీఆర్ఎస్ మునిగి తేలుతుందనే భావన అసలు రానివ్వకూడదు.
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలంటే, కవిత అంశాన్ని పార్టీ వ్యవస్థ నుంచి వేరు చేసి చూడాల్సిన అవసరం ఉంది. ఆమెకు ఎంత ప్రాధాన్యం ఇస్తే.. అంతగా బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుంది. కుటుంబంతో గొడవపడి బయటకు వెళ్లిన వ్యక్తిలాగే చూసుకోవాలి. కవిత విషయాన్ని బీఆర్ఎస్ నాయకత్వం ఎంత చాకచక్యంగా హ్యాండిల్ చేస్తుందనే దానిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని అనుకోవచ్చు.
