సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ లో ఎక్కువ రోజులు గడిపిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు అయిన గువ్వల బాలరాజు పార్టీకి గుడ్ బై చెప్పారు. బాధాతప్త హృదయంతో కేసీఆర్కు ఓ లేఖ రాశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు కేసీఆర్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయన తనకు ఆ పదవి కూడా అవసరం లేదని పార్టీకి గుడ్ బై చెప్పారు.
బీజేపీ నేతలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయారంటూ ఫామ్ హౌస్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా నడిచింది. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఆ ఎపిసోడ్ లో ఉన్నారు. ఆ నలుగురిలో ఒకరు బాలరాజు. ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత దాదాపుగా నెల రోజులకుపైగా కేసీఆర్ తో పాటు ప్రగతి భవన్ లోనే ఉన్నారు. ఈ కేసులో బీజేపీ అగ్రనేతల్ని అరెస్టు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది.
ఇప్పుడు బాలరాజు నేరుగా వెళ్లి బీజేపీలోనే చేరడానికి ఒప్పందం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట ఆయన బీజేపీ కొత్త తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు. అక్కడ పార్టీలో చేరేందుకు ఒప్పందం జరగడంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మరో ముగ్గురు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. వారు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయబోతున్నారని చెబుతున్నారు.