కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు నిరసనగా స్థానిక కీలక నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పార్టీని నమ్ముకుని ఉన్న పాత నేతలను, కష్టకాలంలో నిలబడిన కార్యకర్తలను కౌశిక్ రెడ్డి విస్మరిస్తున్నారని, కేవలం తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఇటీవల కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు , జాతరల సమయంలో జరిగిన గొడవలు పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఈటల రాజేందర్‌ను ఎదుర్కొని పార్టీని కాపాడిన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు కౌశిక్ రెడ్డితో కలిసి పనిచేయలేమని తేల్చి చెబుతోంది. ఎమ్మెల్యే అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల నియోజకవర్గంలో పార్టీ కేడర్ రెండుగా చీలిపోయిందని, ఇది భవిష్యత్తులో పార్టీ మనుగడకే ప్రమాదకరమని జిల్లా నాయకత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. కౌశిక్ రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే తామంతా సామూహిక రాజీనామాలకు సిద్ధమని వారు హెచ్చరిస్తున్నారు.
హుజూరాబాద్‌కు చెందిన పలువురు ముఖ్య నేతలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు జిల్లా మంత్రి ,కాంగ్రెస్ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని, కౌశిక్ రెడ్డి ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని భావిస్తున్న నేతలు, త్వరలోనే ముహూర్తం చూసుకుని హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హుజూరాబాద్‌లో ఈ పరిణామాలు బీఆర్ఎస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఎమ్మెల్యే దూకుడుగా వ్యవహరిస్తుంటే, మరోవైపు కేడర్ చేజారిపోతుండటంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరం గా తయారైంది.


