2026 తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. ఎన్నికలు జరిగిన నల్గొండ, నిజామాబాద్, రామగుండం, మహబూబ్నగర్, మంచీర్యాల, కొత్తగూడెం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ ప్రభావం పూర్తిగా కనుమరుగైంది. గతంలో ఈ ప్రాంతాల్లో బలమైన పట్టున్న నేతలు ఉన్నప్పటికీ, ప్రజలు మాత్రం అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.
ముఖ్యంగా నల్గొండ వంటి చోట్ల కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగా, బీఆర్ఎస్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. కొత్తగూడంలో కాంగ్రెస్,సీపీఐ మధ్య పోటీ జరిగింది. మహబూబ్ నగర్లోనూ కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం. రామగుండంలో బీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితమయింది. ఒకప్పుడు కంచుకోటలయిన నిజామాబాద్, కరీంనగర్ లలో బీజేపీ దూకుడు చూపించింది. కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది.
కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లలో స్వతంత్రులు సైతం బీఆర్ఎస్ కంటే మెరుగైన ఫలితాలు సాధించడం ఆ పార్టీ స్థితికి అద్దం పడుతోంది. మొత్తం ఏడు కార్పొరేషన్లలో నాలుగు చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం చూపిస్తోంది. కొత్తగూడెంలో సీపీఐతో కలిసి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయవచ్చు. కరీంనగర్ , నిజామాబాద్లో బీజేపీ మేయర్ అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది.