రేవంత్ రెడ్డి సీఎం అయిన ఆరు నెలల్లో బీఆర్ఎస్ఎల్పీ.. కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుంది అని సగటు కాంగ్రెస్ అభిమాని గట్టిగా అనుకున్నాడు. ఎందుకంటే రెండు సార్లు కాంగ్రెస్ ఎల్పీని కేసీఆర్ తన పార్టీలో విలీనం చేసుకున్నారు. దానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారని భావించారు. కానీ రేవంత్ మొదట్లో.. రెండు సార్లు ఎల్పీల్ని విలీనం చేసుకున్నా.. తమ గెలుపును ఆపలేకపోయారని .. తమకు ఫిరాయింపుల మీద నమ్మకం లేదన్నారు. కానీ తర్వాత ప్రభుత్వం పై కుట్ర చేస్తున్నారన్న సమాచారం రావడంతో.. విధానం మార్చుకున్నారు. కానీ అనుకున్న విధంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించలేకపోయారు.
మొదట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి రేవంత్ తో సమావేశమయ్యేవారు. ఆ వ్యూహం చూసి..ఇక విలీనానికి సరిపడా ఎమ్మెల్యేలు అందరితో చర్చలు పూర్తయ్యాక ఒకే సారి చేర్చుకుంటారని.. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా విలీన ప్రక్రియ ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ తర్వాత ఒకరొకరికి కండువాలు కప్పడం ప్రారంభించారు. చివరికి ఆ సంఖ్య పది వద్ద ఆగిపోయింది. ఎల్పీనగర్ సుధీర్ రెడ్డి వంటి వారు కనుసైగ చేస్తే పార్టీలోకి వస్తారని రేవంత్ అనుచరులు అంటారు. కానీ ఎందుకు చేయలేదో కానీ.. పది మంది దగ్గరే ఆగిపోవడంతో ఇప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
కేసీఆర్ .. పార్టీ ఫిరాయింపుల్ని వ్యూహాత్మకంగానే చేశారు. కొంత మందిని చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చినా.. తర్వాత ఆ పార్టీ ఎల్పీల్ని విలీనం చేసుకుని ఓ రూలింగ్ ఇచ్చుకున్నారు. దాని వల్ల ఇప్పుడు కేటీఆర్ సమర్థించుకుంటున్నారు. దమ్ముంటే కేసీఆర్ తరహాలో విలీనం చేసుకోవాలని ఆయన అంటున్నారు. లేకపోతే అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయపోరాటం చేయడంతో ఇప్పుడు వేటు వేయడమో..లేకపోతే పార్టీ మారలేదని చెప్పించడమో చేయాల్సి వస్తోంది. ఈ రాజకీయం కాంగ్రెస్ కుఇబ్బందికరంగా మారింది.
ఇప్పటికైనా పోయేదేమీ లేదని..కేసీఆర్ నే ఆదర్శంగా తీసుకుని ఆయన తరహాలోనే ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్న అభిప్రాయం కాంగ్రెస్ క్యాడర్ నుంచి వస్తుంది. కానీ ఇప్పుడెవరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు?