పార్టీలు ఊరకనే మారరు.. ఆ మార్పు వెనుక చాలా సమీకరణాలు ఉంటాయి. ఈ విషయాన్ని మరోసారి పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిరూపించారు. ఆయన మైనింగ్ స్కాంలో ఇరుక్కుని ఎక్కడ దొరికిపోతానో అని కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పటాన్ చెరు నియోజకవర్గంలో ఆయన సోదరుడితో కలిసి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారు. దాదాపుగా మూడు వందల కోట్ల విలువైన స్కాం చేశారు. దీనిపై ఈడీ దర్యాప్తు చేసింది. తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
బీఆర్ఎస్ హయాంలో.. ఎమ్మెల్యేగా ఉన్నప్ప్ుడు ఆయన సోదరుడి కంపెనీ పేరు మీద ఓ మైనింగ్ లీజు తీసుకున్నారు. తర్వాత మరో కుటుంబ కంపెనీకి సబ్ లీజుకు ఇచ్చినట్లుగా చూపించారు. కానీ నిబంధనల ప్రకారం అలా ఇవ్వకూడదు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కాకుండా అసైన్డ్ ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు చేసి పెద్ద ఎత్తున నిర్మాణాలకు అమ్ముకున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి రాయల్టీ కింద రూ.39.08 కోట్లు ఆదాయం నష్టం జరిగింది.
ఈడీ దర్యాప్తులో, ఈ అక్రమ మైనింగ్ నుంచి వచ్చిన ఆదాయం ను బినామీల పేర్లలో ఆస్తులుగా పెట్టుబడి పెట్టినట్లు తేలింది. గతంలో ఎమ్మెల్యే, ఆయన సోదరుడి ఇళ్లల్లో సోదాలు చేసినప్పుడు బినామీ ఆస్తి పత్రాలు లభించాయి. రూ.78.93 కోట్ల విలువైన 81 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. ఈ సంస్థల పేర్లలో రూ.1.12 కోట్ల స్థిర డిపాజిట్లను కూడా అటాచ్ చేశారు. మొత్తం రూ.80 కోట్లకు పైగా ఆస్తులు జప్తు చేశారు. ఈ దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే జూలై 2024లో గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరారు. ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.