బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభలో సభ్యులు లేవు. రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు సురేష్ రెడ్డి. ఈ నెలలోనే ఆయన పదవి కాలం పూర్తి కాబోతోంది. ఆయనకు ఏపీ రాజధాని బిల్లుపై మాట్లాడే అవకాశం వచ్చింది. అయితే అసలు అమరావతి గురించి కాకుండా.. కాళేశ్వరంపై తమ పార్టీ బాధను చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అమరావతికి మద్దతుగానే.. వ్యతిరేకంగానో ఎలాంటి కామెంట్లు చేయలేదు. కాళేశ్వరంపై నిత్యానందరాయ్ చేసిన లక్ష కోట్లు కొట్టుకుపోయాయన్న కామెంట్స్ ను రికార్డుల నుంచి తీసేయాలని సురేష్ రెడ్డి కోరారు.
దీనికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వలేదని సురేష్ రెడ్డి అనడంపై మండిపడ్డారు. ప్రజల డబ్బుతో కాకుండా కేసీఆర్ సొంతడబ్బుతో కట్టారా అనికిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాళేశ్వరంను ఏటీఎంలా ఉపయోగించుకుందన్నారు. కేంద్రం సహకరించకపోతే రూ. లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. వీరిద్దరూ అమరావతి బిల్లుపై ఇలా కాళేశ్వరంపై వాదోపవాదాలు చేసుకున్నారు. తర్వాత వేరే సభ్యులు మాట్లాడారు.
వైసీపీకి బీఆర్ఎస్ మిత్రపక్షం. బీఆర్ఎస్కు వైసీపీ మిత్రపక్షం. అందుకే వైసీపీకి ఇష్టం లేని బిల్లును బీఆర్ెస్ వ్యతిరేకించకుండా ఇలా అమరావతికి బదులుగా కాళేశ్వరం గురించి చెప్పుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే అమరావతి బిల్లును వ్యతిరేకిస్తామన్న ప్రకటన కూడా చేయలేదు. బీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలో బలంగా ఉంది. ఇప్పుడు ఈ విధానంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.

