భారత రాష్ట్ర సమితి నేతలకు మళ్లీ ప్రజల్లో ఆదరణ ఎలా తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. ప్రతిపక్షంగా పోరాడుతున్నామో లేదో వారికి క్లారిటీ ఉండటం లేదు. ప్రభుత్వంపై వ్యతిరికేత పెరిగిపోయిందని ఎలాంటి ఎన్నికలలోనూ గెలిపించరని ఎంత ప్రచారం చేసినా జూబ్లిహిల్స్‌లో ఫలితం తేడా వచ్చింది. అయినా రెండో స్థానంలో ఉన్నామని సంతృప్తి పడి.. నమ్మకం తెచ్చుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల్లో సెంటిమెంట్ మళ్లీ రగిల్చాలని అదే శ్రీరామరక్ష అనుకున్నారు. దీక్షాదివస్ పేరుతో వారు చేసిన ఈవెంట్ అలాంటిదే.
రాజకీయాల్లో ఏ అస్త్రం అయినా ఒక్క సారే
రాజకీయాలు చాలా డైనమిక్ గా ఉంటాయి. రాజకీయ పార్టీలకు చాలా బలంగా ఉన్న ఆయుధం ఏదైనా ఒక్క సారే ఉపయోగపడుతుంది. తెలంగాణ ఉద్యమం అనే కాన్సెప్ట్ మీద పార్టీని సుదీర్ఘంగా నడిపిన బీఆర్ఎస్ బాస్‌లకు ఇప్పుడా ఆయుధానికి కాలం చెల్లిందని తెలుసు. తెలంగాణ ఏర్పాటు అన్నది జరిగినప్పుడే ఇక తెలంగాణ వాదం లేకుండా పోయింది. ప్రత్యేక తెలంగాణనే సెంటిమెంట్ కు క్లైమాక్స్ అయినప్పుడు ఆ తర్వాత కూడా .. తెలంగాణ ప్రజల్నే బూచిగా చూపించి.. ఆ సెంటిమెంట్ రగిలించి చలికాచుకోవాలనుకోవడం అసాధ్యం అవుతుంది. బీఆర్ఎస్ గుర్తించడం లేదు.
ఉద్యమం క్రెడిట్ కేసీఆర్ ఒక్కరికే ఇవ్వలేరు !
తెలంగాణ సమాజం ఉద్యమ క్రెడిట్ కేసీఆర్ ఒక్కరికే ఇచ్చేందుకు సిద్దంగా లేదు. ఆయన దీక్ష చేసిన మాట నిజమే కానీ.. వందల మంది ప్రాణ త్యాగం చేశారు. సకల జనుల సమ్మె జరిగింది. ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగం అయ్యారు. అందుకే.. ఆ క్రెడిట్ కేసీఆర్ లేదా బీఆర్ఎస్కు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఉద్యమానికి నాయకత్వం వహించినందున ఆ గౌరవం మాత్రం కేసీఆర్ కు ప్రజలు ఇస్తారు. అందుకే బీఆర్ఎస్ కు ప్రజలు మొదటి సారి అవకాశం కల్పించారు. రెండో సారి కూడా రాజకీయ సమీకరణాలతో కలసి వచ్చింది. ఆ కారణంతో పదే పదే అధికారాన్ని ఇవ్వడానికి ప్రజలు సిద్ధపడలేదు.
ఇప్పుడు సెంటిమెంట్ కాదు అంత కన్నా పెద్ద వ్యూహాలు కావాలి !
తెలంగాణలో తెలంగాణ వాసుల పాలనే సాగుతోంది. పేరుతో తెలంగాణ అని తీసేసి బీఆర్ఎస్ పెట్టుకుని మేము మాత్రమే తెలంగాణ సేవియర్లం.. మా పార్టీ మాత్రమే తెలంగాణ పార్టీ.. మిగతా అంతా తెలంగాణ ద్రోహులు అంటే.. ప్రజలు కూడా కాస్త విచిత్రంగా చూస్తారు. తమను తాము చూసుకుని మమ్మల్ని కూడా తెలంగాణ ద్రోహులు అంటున్నారని అనుకుంటారు. అలాంటి పాలసీలను ఆమోదించరు. వ్యతిరేకిస్తారు. అందుకే భారత రాష్ట్ర సమితి ప్రజల్ని భావోద్వేగంతో రెచ్చగొట్టాలనుకోవడం మానేసి.. కొత్త రాజకీయ పార్టీ.. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ కాన్సెప్టులతో ప్రయత్నించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండే అవకాశం ఉంది.