తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు భారత రాష్ట్ర సమితికి మనసు రాలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమకు ఉన్న నాలుగు ఓట్లను ఎవరికీ వేయకూడదని నిర్ణయించుకుంది. మంగళవారం ఈ పదవికి ఓటింగ్ జరగనుంది. ఇప్పుడు ఎవరో ఒకరికి ఓటు వేయడం కన్నా సైలెంటుగా ఉండటం మంచిదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
నాలుగు ఓట్లతో ఫలితం తేలదు.. ఇలాంటి సందర్భంలో తమ తెలంగాణ సెంటిమెంట్ ను బలపరుచుకునేందుకు సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొంత మందిలో వినిపించినప్పటికీ.. అలా చేస్తే బీజేపీకి కోపం వస్తుందన్న కారణంగా వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఓటింగ్ చేయకపోయినా బీజేపీకి మేలు చేసినట్లే అవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ మద్దతు తీసుకోకపోవడమే మంచిదని ఎన్డీఏ కూటమి భావించింది. అందుకే కనీసం మద్దతు కూడా అడగలేదని చెబుతున్నారు.
సుదర్శన్ రెడ్డి పదే పదే తాను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని కాదని.. రాజ్యాంగనిపుణుడినని.. ఆ కోణంలోనే తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్కు ధైర్యం చాలడం లేదు. తమ సెంటిమెంట్ రాజకీయాలకు.. సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వకపోవడం వల్ల తీవ్ర విఘాతం కలుగుతుంది. దేశ రెండో అత్యున్నత పదవికి తెలంగాణ బిడ్డ పోటీ పడుతూంటే.. మద్దతివ్వలేని తెలంగాణ వాదం ప్రజల్ని మెప్పించదు. అయినా బీఆర్ఎస్కు మరో చాయిస్ లేకుండా పోయింది.