మేము ఇంకాప్రతిపక్ష నేత పాత్ర పోషించడం లేదని.. కొద్ది రోజుల కిందట ఫామ్ హౌస్ లోనే .. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిరాశగా చెప్పారు. ప్రతిపక్షం అంటే ఏం చేయాలో ఆయనకు తెలుసు. బీఆర్ఎస్ చేయాల్సింది ఏమిటో.. చేస్తుంది ఏమిటో కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆ మాట అన్నారు. ప్రతిపక్షంగా ఉన్నా… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు అస్త్రాలుగా ఉన్నా.. అసలు బయటకు రాలేని స్థితిలో బీఆర్ఎస్ ఉంది. ప్రభుత్వంపై పోరాడలేక.. తనకు తెలిసిన రాజకీయమే చేసుకుంటూ అధికారంలోకి వచ్చేస్తామని కలలు కంటున్నారు.
సమస్యల వలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల వలయంలో ఉంది. యూరియా నుంచి స్థానిక ఎన్నికల వరకూ.. అన్నీ సమస్యలే. ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లేదు. ఎవరు ఏ పని చేస్తున్నారో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రికి హైకమాండ్ సూపర్ పవర్స్ ఇవ్వలేదు. ఆయన మాత్రం ఆయన పని చేయగలుగుతున్నారు. ఇతరులేం చేస్తున్నారో సమీక్ష చేయలేకపోతున్నారు. ఫలితంగా పాలన మందగించింది. సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ వారి కోసం పోరాడేవారు మాత్రం కనిపించడం లేదు.
పార్టీ కోసం తప్ప ప్రజల కోసం పోరాటాలు చేయని బీఆర్ఎస్
గద్వాలలో కేటీఆర్ సభ పెట్టారు. ఎందుకంటే..తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరాడని.. ఆయనపై యుద్ధం చేయడానికి. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలన్నీ పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారం కోసమే కానీ.. ప్రజల కోసం..ప్రజా సమస్యల కోసం రోడ్ల మీదకు వచ్చిన సందర్భం కూడా లేదు. ధర్నాలకు పిలునిచ్చింది కూడా .. కేసీఆర్ పై కేసులు పెట్టారని..కాళేశ్వరంపై విచారణలు చేస్తున్నారనే. పూర్తిగా తన పార్టీ కోసం పోరాటాలు చేస్తున్నారు. కానీ అందులో ప్రజాకోణాన్ని మాత్రం మర్చిపోయారు.
కేసీఆర్ విరక్తి – అందుకే ఈ పరిస్థితి
కేసీఆర్ కు పూర్తిగా విరక్తి పుట్టేసినట్లుగా కనిపిస్తోంది. వరంగల్ బహిరంగసభ తర్వాత యాక్టివ్ అవుతారని అనుకున్నారు. కానీ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మారకపోవడం.. పైగా కుటుంబంలో చీలిక రావడంతో ఆయన పూర్తిగా రాజకీయాల్ని కేటీఆర్ కు వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. గతంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ఫామ్ హౌస్ లో ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ అనే ప్రచారం జరుగుతుంది కానీ అక్కడ వారితో సమావేశం అయ్యేది కేటీఆరే. మొత్తం..బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడం లేదన్నది అందరికీ క్లారిటీ వచ్చింది. జగదీష్ రెడ్డి చెప్పాడంటే.. వారికీ క్లారిటీ ఉన్నట్లే. మరి ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడం ప్రారంభిస్తారు.