కాళేశ్వరం రిపోర్టుపై విచారణ చేయాలని తెలంగాణ అసెంబ్లీ సీబీఐకి సిఫారసు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఊహించలేకపోయింది. సీఐడీ లేదా సిట్ కు అప్పగిస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా కాళేశ్వరం నివేదిక భారాన్ని రేవంత్ దించేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ కు రిలీఫ్ దక్కకుండా బీజేపీ చేతికి చిక్కేలా చేశారు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సమస్యగా మారింది. ఇదే చాన్స్ అనుకుని బీజేపీ సీబీఐని రంగంలోకి దింపుతుందా లేకపోతే రేవంత్ రెడ్డి వ్యూహంలో తాము ఎందుకు పావులుగా మారాలని సైలెంట్ గా ఉంటుందా అన్నది బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు.
ఫామ్ హౌస్ కు వెళ్లిన కేటీఆర్.. కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. న్యాయనిపుణులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఎలా ముందడుగు వేయాలన్నదానిపై చర్చిస్తున్నారు. రేవంత్ బీజేపీతో లోపాయికారీగా మాట్లాడుకునే ఈ తీర్మానం చేశారా లేకపోతే.. తామే చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుదంని .. బీజేపీని పావుగా చేసుకున్నారా అన్నదానిపై కేసీఆర్ లోతైన పరిశీలన చేస్తున్నారు.
కేటీఆర్ ప్రాథమిక స్పందన మాత్రం .. ఎప్పట్లాగే ఉంది. కాళేశ్వరంపై చేస్తున్న కుట్ర అని.. గోదావరి నీళ్లన్ని ఏపీకి తరలించేందుకు మోదీ, రేవంత్, చంద్రబాబు కలిసి చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మాత్రం గోదావరి నీళ్లు తెలంగాణలో ఆగుతున్నాయా నేరుగా ఏపీ మీదుగా సముద్రంలోకి పోతున్నాయి. ఆపుకోవద్దని ఎవరూ అనడం లేదు. అయినా ఇదే వ్యూహాన్ని కేటీఆర్ అమలు చేస్తున్నారు. కానీ ఇంపాక్ట్ రావడం కష్టమే. బీజేపీ నేతుల కూడా .. ఈ నివేదికపై ఆయనే చర్యలు తీసుకోకుండా తమ వైపు ఎందుకు నెట్టారని మథనపడుతున్నారు.
ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుందన్నదానిపై స్పష్టత లేదు. రాజకీయంగా వచ్చే తదుపరి పరిణామాలను బట్టి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.