ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ అధికారులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో రికార్డెడ్ విచారణ జరుగుతోది. విచారణ కోసం కేసీఆర్ రెండుగంటల ముందుగానే ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం పార్టీ నేతలతో కలిసి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి ఎక్కడైతే వ్యూహరచన చేశానో అదే గదిలో సిట్ విచారణను ఎదుర్కోవడంపై భావోద్వేగానికి గురైనట్లుగా పార్టీ నేతలు చెప్పారు.
సిట్ విచారణ ప్రారంభమయ్యే సమయానికి కుటుంబసభ్యులను తప్ప మిగతా అందర్నీ బయటకు పంపేశారు. మరో వైపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ తో పాటు కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. తెలంగాణ జాతిపితపై కక్ష సాధిస్తున్నారని ఆరోపణలు చేశారు. కొన్ని చోట్ల ముట్టడి కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో చిన్నపాటి ఉద్రిక్తత ఏర్పడింది.
కేసీఆర్ విచారణ రాత్రి పొద్దుపోయే వరకూసాగే అవకాశాలు ఉన్నాయి. గతంలో కేటీఆర్, హరీష్ రావులను ఉదయం పిలిచారు. సాయంత్రం ఏడు గంటల వరకూ ప్రశ్నించారు. మొత్తంగా వారిని చెరో ఏడు గంటల పాటు ప్రశ్నించారు. సంతోష్ రావును కూడా అలాగే ప్రశ్నించారు కానీ ఆయనను మధ్యాహ్నం పిలవడంతో .. అర్థరాత్రి వరకూ విచారణ జరిగింది. కేసీఆర్ విచారణ అర్థరాత్రి వరకూ సాగకపోవచ్చని భావిస్తున్నారు.
