భారత రాష్ట్ర సమితిని కాళేశ్వరం సునామీ చుట్టుముట్టబోతోంది. ఇప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడానికి సర్వశక్తులు ఒడ్డాలి. కానీ చాలా సమస్యలను ఇంకా పరిష్కరించుకోకుండా నాన్చుతున్నారు. అవి పెరిగి పెద్దవి అవుతున్నాయి. అలాంటి సమస్యల్లో ఒకటి కవిత రాజకీయం. కవిత తాను బీఆర్ఎస్ నేతననే అనే క్లెయిమ్ చేసుకుంటున్నారు. జాతీయ మీడియా ఇంటర్యూల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్తో బంధం తెగిపోయింది. బీఆర్ఎస్ కండువా ఆమె వేసుకోవడం లేదు. ఆమెను బీఆర్ఎస్ కార్యక్రమాలకు పిలవడం లేదు. మెల్లగా కోల్డ్ వార్ కూడా మీడియాకు ఎక్కుతోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఈ సమస్యను వేగంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
తనపై బీఆర్ఎస్ నేతలు ఎటాక్ చేసే వరకూ ఓపికగా చూస్తున్న కవిత
కవిత చాలా పక్కా ప్రణాళికతో ఉన్నారు. రాజకీయంగా తన సొంత అజెండా ఉంది. బీఆర్ఎస్ వారసులలో తన పేరు కూడా ఉంటుందని ఆమె నమ్మకంగా ఉన్నారు . కేటీఆర్కు బ్యాటన్ వదిలి పెట్టేయడానికి సిద్ధంగా లేరు. అలాంటి పరిస్థితి వస్తే సొంత రాజకీయం చేయడానికి ఆమె సిద్ధమయ్యారు. అందుకే జాగృతిని మెల్లగా నిర్మించుకుంటున్నారు. అయితే కవితను ఎలా డీల్ చేయాలో తెలియక.. బీఆర్ఎస్ నేతలు కిందా మీదా పడుతున్నారు. జగదీష్ రెడ్డి లాంటి నేతలు కాస్త అటూ ఇటూ మాటలు మాట్లాడుతూండటంతో అదే అవకాశంగా కవిత విక్టిమ్ కార్డు బయటకు తీసి .. ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఎఫెక్ట్ కోసమే ఆమే ఓపికగా చూస్తున్నారు.
కవితకు సానుభూతి వచ్చేలా వ్యవహరిస్తే బీఆర్ఎస్కే నష్టం
కవిత కేసీఆర్ కుమార్తె. ఆమెపై పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కవిత కుటుంబసభ్యులు చేయలేరు . అలాగని పార్టీ నేతలు అసలు చేయలేరు. కానీ జగదీష్ రెడ్డి, క్రిషాంక్, సబితా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి వంటి వారు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. వీరు ఇలా మాట్లాడటానికి హైకమాండ్ నుంచి పర్మిషన్ ఉందో లేదో తెలియదు కానీ.. కేసీఆర్ కుమార్తెపై ఎవరో ఒకరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా అదే పార్టీలో ఉంటూ స్పందించేంత సాహసం చేయరని అనుకోవచ్చు. కానీ కవిత కూడా రాజకీయ నాయకురాలే. ఎలా రాజకీయంగా ఉపయోగించుకోవాలో ఆమెకు బాగా తెలుసు.
తక్షణం నిర్ణయం తీసుకోవాల్సిందే !
కవిత నేరుగా పార్టీ లో పెత్తనం అడగడం లేదు. తనకు కూడా ప్రాధాన్యం కావాలని అడుగుతున్నారు. బీజేపీలో విలీనం వద్దంటున్నారు. ఈ రెండింటిపై క్లారిటీ ఇస్తే.. కవిత మళ్లీ పార్టీ లైన్ లోకి వస్తారు. బీజేపీతో విలీనం లేదని కేటీఆర్, కేసీఆర్ చెప్పడం లేదు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందని కేటీఆర్ అంటున్నారు. అలాంటప్పుడు విలీన వార్తల్ని గట్టిగా ఖండించాలి. ఆ పని చేయడం లేదు. కవితకు పార్టీలో ఎలాంటి పాత్ర ఇస్తామో చెప్పాల్సింది. కానీ ఆమెను రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒక వేళ కవిత అవసరం లేదనుకుంటే.. ఆమెను పార్టీ నుంచి బయటకు పంపేయాలి. కుటుంబం ఏకతాటిపైకి ఉంటేనే బీఆర్ఎస్కు బలం అనుకుంటే.. ఏదో ఒకటి చేసి రాజీ చేసుకోవాలి. కానీ ఇలా సమస్యను పెంచుకుంటూ పోతే.. ఎదురొచ్చేది ఓటమే.