తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ భారత్ రాష్ట్ర సమితి అనుసరిస్తున్న వ్యూహాలు ఆ పార్టీలో నెలకొన్న ఆందోళనను, నైరాశ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఏ ఎన్నిక వచ్చినా అగ్రనాయకత్వమే ముందుండి నడిపించాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు పూర్తిగా క్యాడర్ కు వదిలేస్తున్నారు. ప్పుడు కేసీఆర్ బహిరంగ సభలను రద్దు చేసుకోవడం, కేటీఆర్ బాధ్యతలను స్థానిక నేతలకే పరిమితం చేయడం వంటి పరిణామాలు పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సభలు పెట్టి కేడర్లో ఉత్సాహం నింపాల్సింది పోయి, ఎన్నికలు ఉన్నాయనే సాకుతో సభలు వాయిదా వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ఏ పార్టీకైనా అగ్రనేతలే ప్రధాన ఆకర్షణ. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై పూర్తి నమ్మకం లేకపోవడం వల్లే హైకమాండ్ ఇప్పుడు చేతులు దులుపుకునే” ధోరణి అవలంబిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు గుర్రాలను ఎంచుకోవడం వరకు అంతా నియోజకవర్గ ఇంచార్జులు, ఎమ్మెల్యేల బాధ్యతేనని తేల్చి చెప్పడం వెనుక ఒకవేళ ఫలితాలు తారుమారైతే ఆ భారాన్ని స్థానిక నేతలపైకి నెట్టేసే వ్యూహం కనిపిస్తోంది. ఇది క్షేత్రస్థాయిలో కష్టపడే నాయకులకు భరోసా ఇవ్వాల్సింది పోయి, వారిని ఒంటరిని చేసినట్లు అవుతోంది.
పార్టీ ఫిరాయింపులు, ఫోన్ ట్యాపింగ్ వంటి వరుస వివాదాలతో ఇప్పటికే రక్షణ ధోరణిలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం, ఎన్నికల యుద్ధంలో పరోక్షంగా సరెండర్ అవుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా రిజర్వేషన్లు, ఇతర కసరత్తులు పూర్తి చేస్తున్న వేళ, ప్రతిపక్షంగా దూకుడు ప్రదర్శించాల్సిన గులాబీ దళం ఇలా వైరాగ్యం ప్రదర్శించడం పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. పోరాడి ఓడిపోవడం వేరు, కానీ పోరాడకముందే పలాయనం చిత్తగించడం రాజకీయంగా ఆ పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తుంది.
నాయకత్వం అనేది క్లిష్ట సమయాల్లోనే ముందుండి నడిపించాలి. కానీ బీఆర్ఎస్ అధిష్టానం ప్రస్తుత వైఖరి చూస్తుంటే బాధ్యతలను బదిలీ చేయడం ద్వారా తన ప్రాముఖ్యతను తానే తగ్గించుకుంటున్నట్లు కనిపిస్తోంది. లోకల్ లీడర్లకే అన్నీ వదిలేయడం వల్ల సమన్వయ లోపం ఏర్పడి, ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ రాజకీయం ఇలాగే కొనసాగితే, మున్సిపల్ ఎన్నికలు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారే అవకాశం ఉందని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.
