తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ విషయంలో అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకునే క్రమంలో సుప్రీంకోర్టులో ఎదురైన పరిణామం బీఆర్ఎస్కు పెద్ద ఆయుధంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ అర్హత లేనిదిగా పేర్కొంటూ, ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ఫైల్ చేయాలని సూచించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఎండగడుతోంది. ప్రభుత్వ అసమర్థత వల్లే కోర్టులో ఇలాంటి పరిస్థితి ఎదురైందని, ఇది తెలంగాణకు జరుగుతున్న చారిత్రక ద్రోహమని ఆరోపణలు ప్రారంభించారు.
వివరణ ఇచ్చుకుంటున్నట్లుగా ఉత్తమ్ తీరు
జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో రక్షణాత్మక ధోరణిలో కనిపిస్తున్నారు. సుప్రీంకోర్టు సూచన మేరకు రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని, మరింత పటిష్టమైన సివిల్ సూట్ దాఖలు చేస్తామని ఆయన వివరణ ఇస్తున్నారు. రిట్ పిటిషన్ ఆలోచన ఎందుకు వచ్చిందో.. గట్టిగా సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. బీఆర్ఎస్ చేస్తున్న బలహీనమైన పిటిషన్ అనే ఆరోపణలను కౌంటర్ చేయడంలో తడబడుతున్నారు. తాము న్యాయపోరాటం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, కోర్టులో జరిగిన సాంకేతిక తప్పిదాలను బీఆర్ఎస్ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమవుతోంది. దీనివల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసే వివరణలు కేవలం సమర్థించుకోవడానికే పరిమితమవుతున్నట్లు కనిపిస్తున్నాయి.
ఉత్తమ్‌ను ఒత్తిడికి గురి చేస్తూ తీవ్రంగా బీఆర్ఎస్ ఆరోపణలు
జల వివాదాన్ని సెంటిమెంట్‌గా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందనే ముద్ర వేయాలని బీఆర్ఎస్ చూస్తోంది. ముఖ్యంగా సివిల్ సూట్ వేయడం అంటే ఏపీకి ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి సమయం ఇవ్వడమే అన్న హరీశ్ రావు వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఈ విమర్శల నుంచి బయటపడేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గతం వైపు వేలెత్తి చూపుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే జల దోపిడీకి పునాదులు పడ్డాయని, కేసీఆర్ సంతకాల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని పాత అంశాలను మళ్లీ ప్రస్తావిస్తున్నారు. అయితే, ప్రస్తుత సంక్షోభంలో కొత్త ప్రభుత్వం ఏం చేస్తోందన్న ప్రశ్నకు మాత్రం ఆయన వివరణాత్మక ధోరణిలోనే స్పందిస్తున్నారు.
న్యాయపరంగా తప్పటడుగులు
న్యాయపరంగా సివిల్ సూట్ అనేది సమగ్రమైన ప్రక్రియ అయినప్పటికీ, అది పూర్తి కావడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని ఈ లోగా ఏపీ ప్రభుత్వం పనులు పూర్తి చేస్తే పరిస్థితి ఏమిటని బీఆర్ఎస్ అంటోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నా, క్షేత్రస్థాయిలో రాజకీయ మైలేజీ మాత్రం బీఆర్ఎస్ వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం కేవలం వివరణలకే పరిమితం కాకుండా, బీఆర్ఎస్ ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాల్సిందే. అలా ఇవ్వకపోతే బీఆర్ఎస్ చేసే ప్రచారంతో అనుమానాలు పెరిగిపోయే అవకాశం ఉంది. అది కాంగ్రెస్ కు పెను సమస్యగా మారుతుంది.
